అంతర్వేదితో ఏపీలో హిందూ ఓట్ బ్యాంక్ కు బీజం

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలో వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా….దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదనే చెప్పాలి. ప్రధానంగా హిందుత్వ ఎజెండా, హిందూ ఓటు బ్యాంకు వంటి అంశాలతో మతతత్వ రాజకీయాలపై ఆధారపడ్డ బీజేపీకి….కుల సమీకరణాల ఆధారంగా గెలుపోటములు నిర్దేశించే దక్షిణాది రాజకీయాలు అచ్చిరాలేదనే చెప్పవచ్చు. అయితే, ఇటీవల ఏపీలో జరుగుతున్న వరుస ఘటనలు 2024 ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనతో ఏపీలో బీజేపీ హిందూ ఓట్ బ్యాంక్ తొలి ఖాతా తెరిచినట్లేనని అనుకుంటున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే హిందువులు 90.87 శాతం. ముస్లింలు 7.32 శాతం, క్రిస్టియన్లు 1.38 శాతం, ఇతర మతాలవారు 0.43 శాతం ఉన్నారు. ఈ పదేళ్లలో హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి భారీగా చేరికలు జరిగాయని అంచనా. చాలాకాలంగా ఏపీలో మత మార్పిడి, తిరుమల వంటి ప్రఖ్యాత దేవాలయాల పరిసరాల్లో సైతం అన్యమత ప్రచారంపై హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలి కాలంలో దేశంలో…ఏపీలోనూ క్రైస్తవ మత ప్రచారం, అందుకు తగ్గ ఫండ్స్ పెరిగాయని హిందు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక, కొద్దికాలంగా ఏపీలోను ఆ తరహా కార్యకలాపాలకు రాజకీయంగా అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే, రిజర్వేషన్ల కారణంగా క్రైస్తవ మతంలోకి మారినవారంతా అధికారిక లెక్కల్లో కనిపించరు. కాబట్టి 2011 ప్రకారం ఏపీలో క్రైస్తవుల జనాభా 1.38 శాతం ఉండగా…2020 నాటికి 10 రెట్లు ఎక్కువ ఉంటారని అంచనా.

ఈ నేపథ్యంలోనే ఏపీలో హిందువుల ఆలయాలు, వాటి ఆస్తుల వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం చర్చనీయంశమయ్యాయి. టీటీడీ భూముల వేలం వేయాలనుకున్న ప్రభుత్వ…ఆ తర్వాత వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయంపై వెనుకడుగు వేసింది. ఇక, పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో రథం కాలిపోవడం, తాజాగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం వంటి ఘటనలు హిందువుల్లో అభద్రతా భావాన్ని ఏర్పరిచాయి.

ఇక, తాజాగా ఏపీలో అంతర్వేది ఘటన ఏపీలో బీజేపీకి చాలా మైలేజి ఇచ్చిందని చెప్పవచ్చు. ఏపీ బీజేపీ నేతలు గట్టిగా ఫోకస్ చేస్తే…2024 నాటికి కాకపోయినా….2029 నాటికి ఏపీలో అధికారం చేపట్టవచ్చన్న వాదన అతిశయోక్తి కాదు. అయితే, తమ ప్రధాన ఎజెండా హిందుత్వపై కేంద్ర బీజేపీ చూపుతున్న దూకుడు ఏపీ బీజేపీ చూపడం లేదన్న అభిప్రాయలు బీజేపీ పెద్దల నుంచి వ్యక్తమవుతున్నాయట.

కేంద్రంలో బీజేపీ పై మతతత్వ పార్టీ అనే ముద్ర వేసేందుకు సూడో మేధావులు, ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నా బీజేపీ మాత్రం రోజురోజుకు బలపడుతోంది. మోడీ-అమిత్ షా ద్వయం ఆధ్వర్యంలోని బీజేపీ గట్టిగా నమ్ముకున్న హిందుత్వ ఎజెండానే అందుకు కారణం. నిజంగా ఏపీపై మోడీ-షా ఫోకస్ చేసి ఉంటే …అంతర్వేది ఘటన మరింత వైరల్ అయి ఉండేది.

అయితే, ఏపీ తో పాటు దక్షిణాది రాష్ట్రాల కన్నా…ఉత్తరాదిలో తాము బలపడేందుకు అవకాశమున్న రాష్ట్రాలపై ప్రస్తుతం వీరిద్దరూ ఫోకస్ పెట్టారు. దీనికి తోడు కోవిడ్ నేపథ్యంలో ఈ తరహా రాజకీయాలు కేంద్రం స్థాయిలో చేయడం సరికాదని భావించడం, ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల నేపథ్యంలో వారిద్దరూ వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారన్న వాదన ఉంది.

ఏపీ బీజేపీ పెద్దలు, ఏపీ బీజేపీలోని ఇతర కొందరు నాయకులు వైసీపీకి అనుకూలంగా ఉన్నా కేంద్రం మిన్నకుండడానికి కారణమిదేనట. లేకుంటే, ఏపీలో 2024 ఎన్నికలను వారిద్దరూ టార్గెట్ చేసేవారన్న అభిప్రాయాలున్నాయి. దక్షిణాదిలో ఎన్నికలు గెలవాలంటే కులమే ప్రధాన ఆయుధమన్న భావన ఉన్నప్పటికీ…భవిష్యత్తులో కేంద్రంలో మోడీ-షా హవా కొనసాగి…బీజేపీ అధికారంలో ఉంటే మాత్రం….2029 నాటికి మతం కూడా బలమైన ఆయుధంగా మారుతుందనడంలో సందేహం లేదు. అపుడు ఏపీవంటి రాష్ట్రాల్లో హిందూ ఓట్ బ్యాంక్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఏపీలో తొలిసారి హిందు ఓట్ బ్యాంక్ ఖాతా తెరిచేందుకు అంతర్వేది ఘటన బీజం వేసిందని చెప్పవచ్చు.