రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణా బీజేపీలో తలనొప్పులు పెరిగిపోతున్నాయి. మొదటిజాబితాలో భాగంగా తొమ్మిది మంది అభ్యర్ధులను పార్టీ అధిష్టానం ప్రకటించింది. వీరిలో ఆరుగురి అభ్యర్ధిత్వాలపై పార్టీలో గోలగోల జరుగుతోంది. మల్కాజ్ గిరి సీటులో నాన్ లోకల్ ఈటల రాజేందర్ కు టికెట్ ఇవ్వటాన్ని లోకల్ నేతలంతా తప్పుపడుతున్నారు. నాగర్ కర్నూలు టికెట్ ఆశించిన బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతికి నిరాశ తప్పలేదు. అలాగే జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కు ఇవ్వటాన్ని పార్టీలోని చాలామంది నేతలు వ్యతరేకిస్తున్నారు.
ఎందుకంటే ఇక్కడి నుండి పోటీచేయటానికి ఆలె నరేంద్ర కొడుకు ఆలె భాస్కర్, మాజీమంత్రి బాగారెడ్డి కొడుకు జైపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేసుకున్నారు. మొదటిజాబితాలో తమ పేర్లు లేకపోవటంతో డీకే అరుణ, జితేందర్ రెడ్డి మండిపోతున్నారు. వీళ్ళందరి విషయాలను పక్కనపెట్టేస్తే హైదరాబాద్ లోక్ సభ అభ్యర్ధిగా మాధవీలత ఎంపికపై చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏమిటంటే మాధవీలత అసలు పార్టీ నేతే కాదు. టికెట్ ను ప్రకటించిన తర్వాతే మాధవి ఢిల్లీలో అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో సభ్యత్వం కూడా లేని మాధవికి పార్టీ టికెట్ ఇవ్వటంపైన చాలామంది జోకులు వేసుకుంటున్నారు.
అందుకనే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ మాట్లాడుతు హైదరాబాద్ పార్లమెంటు సీటులో పోటీచేయటానికి పార్టీలో మగాడే దొరకలేదా అని సెటైర్లు వేశారు. మాధవి ఎంపికపై రాజాసింగ్ తన అసంతృప్తిని తెలంగాణా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించే చేశారని అందరికీ తెలుసు. ఎందుకంటే మాధవీలత గెలుపు కాదు కనీసం గట్టిపోటీ ఇవ్వాలన్నా రాజాసింగ్ సహకారం తప్పని పరిస్ధితి.
ఇలాంటి పరిస్ధితుల్లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి ఎంపికలో పార్టీ అధిష్టానం కనీసం తన అభిప్రాయాన్ని కూడా తీసుకోలేదని రాజాసింగ్ మండిపోతున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కిషన్ రెడ్డికి రాజాసింగ్ కు ఏమాత్రం పడదు. అందుకనే కిషన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ లోక్ సభ ఎంపీ అభ్యర్ధి ఎంపికపై రాజాసింగ్ సెటైర్లు వేసింది.