కడప జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కూటమి టికెట్లను ప్రకటించలేదు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మొదటిజాబితాలో ప్రకటించిన సీట్లు నాలుగుమాత్రమే. పులివెందులలో బీ టెక్ రవి, రాయచోటిలో రామ్ ప్రసాద్ రెడ్డి, కడపలో మాధవీరెడ్డి, మైదుకూరులో సుధాకర్ యాదవ్ పోటీచేయబోతున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించారు. మిగిలిన ఆరుసీట్లలో ఎన్ని సీట్లలో టీడీపీ పోటీచేస్తుంది పొత్తులో జనసేనకు ఎన్నిసీట్లు ఇస్తుందనే విషయం సస్పెన్సుగా మిగిలింది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం రైల్వేకోడూరు, బద్వేలు రాజంపేట నియోజకవర్గాల్లో పోటీచేయాలని జనసేన బాగా పట్టుదలగా ఉంది.
అయితే జనసేనకు చంద్రబాబు ఎన్ని నియోజకవర్గాలను కేటాయిస్తారో తెలీక తమ్ముళ్ళలో అయోమయం పెరిగిపోతోంది. ఇలాంటి అయోమయమే మరింత ఎక్కువగా బద్వేలు నియోజకవర్గంలో పెరిగిపోతోందట. ఎందుకంటే ఇక్కడ పోటీచేసే ఉద్దేశ్యంతో రోశన్న చాలా కష్టపడుతున్నారు. ఇంజనీరుగా ఉద్యోగంచేస్తున్న రోశన్నకు మొదటినుండి టీడీపీ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతోనే నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నారు. దాంతో విషయం చంద్రబాబు దృష్టిలో పడింది. వెంటనే పిలిపించుకుని మాట్లాడారు. రోశన్న అభ్యర్ధిత్వంపై నమ్మకం పెట్టుకున్న చంద్రబాబు ఇంజనీరుకు టికెట్ ఖాయంచేశారు.
దాంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసేది తానే అన్న ఉద్దేశ్యంతో రోశన్న ఇంజనీరు ఉద్యోగానికి రాజీనామా కూడా చేసేశారు. ఉద్యోగం వదిలేసిన దగ్గర నుండి రాత్రి, పగలు తేడాలేకుండా పార్టీకోసమే పనిచేస్తున్నారు. అయితే ఈమధ్యనే ప్రకటించిన మొదటిజాబితాలో రోశన్న పేరులేదు. దాంతో ఇంజనీరులో కంగారుపెరిగిపోయింది. వివిధ కారణాల వల్ల మొదటిజాబితాలో రోశన్న పేరులేదని పార్టీలోని కీలక వ్యక్తులు చెప్పారట. మరి రెండో జాబితాలో అయినా తన పేరుంటుందా అనే కంగారు ఆయనలో పెరిగిపోతోంది. ఎందుకంటే బద్వేలు నుండి పోటీచేయటానికి సడెన్ గా జనసేన నేతలు రెడీఅయిపోయారట.
బద్వేలులో పోటీచేసే విషయంలో జనసేన నేతలు గనుక పట్టుబడితే పొత్తులో టికెట్ ఇచ్చేయాల్సిందేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే జిల్లాకు ఒక టికెట్ అయినా జనసేనకు కేటాయించాల్సుంటుందని తమ్ముళ్ళు చెబుతున్నారు. కచ్చితంగా కడప జిల్లాలో జనసేన పోటీచేయబోయే సీటు ఇదే అని ఇంతవరకు నిర్ధారణ కాలేదు. కాని రాజంపేట, బద్వేలు మీద జనసేన బాగా దృష్టిపెట్టిందని మాత్రం అర్ధమవుతోంది. మరి చివరకు ఇంజనీరు పరిస్ధితి ఏమవుతుందనేది ఆసక్తిగా మారింది.