వైసీపీకి జనసేనకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు ఎమ్మల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు ఆరణి శ్రీనివాసులు నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలిశారు. తన రాజకీయ భవితవ్యంపై చర్చించారు. అంతే.. ఈ విషయం బయటకు లీక్ కాగానే వైసీపీ అధినేత, సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. ఆరణిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించి వేరే పార్టీ అధ్యక్షుడ్ని కలిశారని, సదరు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏం జరిగింది?
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ పలునియోజకవర్గాలకు సమన్వయ కర్తలను నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును పక్కన పెట్టింది. ఈ స్థానం నుంచి ఇంఛార్జ్‌గా విజయానందరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. తనను కాదని అధిష్టానం వేరొకరికి తన నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ వీడాలని భావించిన ఆయన.. ఈ క్రమంలో జనసేనాని పవన్ తో సమావేశమై చర్చించారు. పార్టీలో చేరికకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఆయన త్వరలోనే జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం.
మరింత మంది జంప్?
వైనాట్ 175 నినాదంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఇంఛార్జ్‌ల వరుస జాబితాలు విడుదల చేస్తున్నారు. మరోవైపు తమ సీటు గల్లంతు కావడంతో అసంతృప్తులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోరిన చోట సీటు రాకున్నా కొందరు అధిష్టానా నికి ఆ మాట స్పష్టం చేస్తున్నారు. ఇదివరకే కొందరు నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరగా.. తాజాగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తనను ఇంఛార్జ్‌గా ప్రకటించక పోవడం, టికెట్ పై స్పష్టమైన హామీ రాకపోవడంతో వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, రాబోయే రోజుల్లో ఈ జంపింగుల పర్వం మరింత ఊపందుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates