కీలక నేతలకు క్లాసు ?

రాబోయే ఎన్నికల్లో పార్టీలోని కీలక నేతలంతా తప్పకుండా పోటీ చేయాల్సిందే అని బీజేపీ ఏపీ ఇన్చార్జి శివప్రకాష్ స్పష్టంగా చెప్పేశారు. ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసే విషయమై అవలంభించాల్సిన విధివిధానాలపై రెండురోజుల పాటు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం శని, ఆదివారాల్లో పార్టీ ఆఫీసులోనే జరుగుతోంది. ఈ సందర్భంగా శివప్రకాష్ మాట్లాడుతూ చాలామంది నేతలు మీడియా సమావేశాలకు మాత్రమే పరిమితమవుతున్న విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికలు పార్టీకి చాలా కీలకం కాబట్టి పార్టీలోని కీలక నేతలంతా కచ్చితంగా పోటీ చేయాల్సిందే అన్నారు.

పార్టీలోని చాలామంది నేతలు 24 గంటలూ మీడియాలో మాత్రమే కనబడుతున్నారనే ఆరోపణలున్నాయి. వీరిలో చాలామందికి క్షేత్రస్థాయిలో జనాల్లో ఎలాంటి పట్టులేదట. ఎందుకంటే ప్రజాసమస్యలపై ఏరోజూ వీళ్ళు పోరాటాలు చేసిందిలేదు. ఢిల్లీ స్ధాయిలోని నేతలతో తమకున్న పరిచయాలు, పట్టు కారణంగా రాష్ట్రంలో చక్రం తిప్పుతుంటారంతే. కొన్ని ముఖ్యమైన పదవుల్లో కూర్చుని మీడియా సమావేశాలు పెట్టుకుని కాలం గడిపేస్తుంటారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. కొంతమందిపైన ఢిల్లీకి ఫిర్యాదులు కూడా అందినాయట. అందుకనే ఎవరి పేరును ప్రస్తావించకుండానే శివప్రకాష్ వార్నింగులు ఇచ్చినట్లు పార్టీలో టాక్ నడుస్తోంది.

175 నియోజకవర్గాలకు 2500 దరఖాస్తులు వచ్చాయి. గతంలో ఎన్నికల్లో పోటీపై పెద్దగా ఆసక్తిచూపని నేతలు కూడా ఇపుడు దరఖాస్తులు చేసుకున్నారట. కారణం ఏమిటంటే ఇప్పటికే ఇలాంటి మీడియా పులలకు అగ్రనేతలు పీకిన క్లాసులే కారణమని సమాచారం. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి 2500ని కుదించారు. ప్రతి నియోజకవర్గానికి మూడు దరఖాస్తులను స్క్రనింగ్ చేశారు. వీటిల్లో కూడా టికెట్ అర్హులుగా గుర్తించిన వారిని రాష్ట్ర నాయకత్వం ఆర్డర్ ఆప్ ప్రయారిటి బేసిస్ లో ఢిల్లీకి పంపబోతోంది.

ఏదేమైనా పార్టీలో వివిధ స్ధాయిలో చాలాకాలంగా పనిచేస్తున్న చాలామంది నేతలను రాబోయే ఎన్నికల్లో పోటీలోకి దింపాలన్నది అగ్రనేతల నిర్ణయం. రాజంపేట, చిత్తూరు, శ్రీకాళహస్తి, జమ్మలమడుగు, అనంతపురం, ధర్మవరం, తిరుపతి లాంటి కొన్ని నియోజకవర్గాలకు ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. మొత్తానికి చంద్రబాబునాయుడుతో జరిపిన పొత్తు చర్చలపై అగ్రనేతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మాత్రం బయటకు చెప్పలేదు. అయితే దరఖాస్తుల స్వీకరణ, స్క్రీనింగ్, అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేయాలనే నిర్ణయాలను మాత్రమే చేసేస్తున్నారు.