నియోజవర్గాలను మార్చి పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించటం లేదు. రాబోయే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో సర్దుబాట్లు చేయాల్సిన అవసరం అధినేతకు వచ్చింది. వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దాంతో వాళ్ళని అకామిడేట్ చేయటం కోసం సీనియర్ తమ్ముళ్ళని నియోజకవర్గాలు మారమని చంద్రబాబు అడుగుతున్నారు. అందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. తమ నియోజకవర్గాల్లోనే తాము పోటీ చేస్తామని గట్టిగానే చెబుతున్నారు. దాంతో ఏమిచేయాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు.
విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావును విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయమని చంద్రబాబు ఆదేశిస్తే కుదరదని చెప్పేశారు. పోటీ చేసే విషయమై నిర్ణయించుకునేందుకు కొంత సమయం అడిగిన గంటా చివరకు కుదరదని చెప్పేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో పోటీచేయమని కళా వెంకటరావును అడిగితే ఆయన కూడా పోటీచేయనని చెప్పేశారు. తన నియోజకవర్గం నెల్లిమర్లలోనే టికెట్ ఇవ్వాలని అడిగారు. అయితే ఆ నియోజకవర్గాన్ని పొత్తులో జనసేనకు కేటాయించారు. ఇక్కడి నుండి అభ్యర్ధిగా లోకం మాధవిని పవన్ ప్రకటించేశారు కూడా.
అయినా సరే కళావెంకటరావు పట్టుపట్టి కూర్చున్నారు. చీపురుపల్లిలో పోటీ చేసేది లేదని చెప్పేశారు. ఇక మైలవరంలో టికెట్ ను వైసీపీ నుండి చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయం. అయితే అందుకు దేవినేని ఉమామహేశ్వరరావు అంగీకరించటం లేదు. మైలవరంలో తానే పోటీ చేస్తానని పట్టుపబట్టారు. మైలవరంకు బదులు పెనమలూరులో పోటీ చేయమని చంద్రబాబు చెప్పినా ఉమ వినటం లేదు. ఇదే సమయంలో పెనమలూరులో తనకు బదులు ఇంకెవరు పోటీచేయాలని చూసినా తాను అంగీకరించలేది లేదని మాజీ ఎంఎల్ఏ బోడె ప్రసాద్ గట్టిగా హెచ్చరిస్తున్నారు.
అలాగే డోన్ లో ధర్మవరం సుబ్బారెడ్డికి బదులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి టికెట్ ప్రకటించారు. ఇక్కడ సుబ్బారెడ్డి అంగీకరించటం లేదు. డోన్ లో పోటే చేయబోయేది తానే అని తెగేసి చెబుతున్నారు. తన సత్తా ఇది అని చాటి చెప్పేందుకు డోన్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం భారీ ర్యాలీని నిర్వహించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సీనియర్ల విషయంలో చంద్రబాబు ఎలాంటి వైఖరి అనుసరిస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates