రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో చాలా పార్టీలు హడావిడి చేస్తున్నాయి. వైసీపీ, టీడీపీ కూటమి, బీజేపీలో చాలా హడావుడి జరుగుతోంది. పోటీ చేయాలనే ఆశక్తి ఉన్న వారినుండి దరఖాస్తులు స్వీకరించటం, స్క్రీనింగ్ చేయటం, నియోజకవర్గానికి ముగ్గురు నేతలను ఎంపికచేయటం లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీలో దరఖాస్తుల గోల లేకపోయినా సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వేల్లో మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిన నేతలతో అధినేతలు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు.
అయితే ఇదే పద్దతిలో కాంగ్రెస్ లో కూడా హడావుడి జరుగుతోంది. ఏపీ చీఫ్ షర్మిల చెప్పిన ప్రకారం పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయటానికి 1351 మంది దరఖాస్తులు చేసుకున్నారట. పార్టీ అధిష్టానం జారిచేసిన మార్గదర్శకాల ప్రకారమే దరఖాస్తుల వడబోత, అభ్యర్ధుల ఎంపిక ఉంటుందని ఆమె చెప్పారు. టికెట్ల పంపిణీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు 50 శాతం కేటాయించబోతున్నట్లు షర్మిల ప్రకటించారు. అభ్యర్ధుల ఎంపికలో లాయల్టీ, హెనెస్టీ, ఇంటిగ్రిటీయే ప్రధానమని షర్మిల స్పష్టం చేశారు.
పోటీచేసే విషయంలో ఆసక్తితో దరఖాస్తులు చేసుకున్న వారితో షర్మిల వరుసగా మూడురోజుల సమావేశమై చర్చించారు. మార్చి 5, 6 తేదీల్లో దరఖాస్తులు చేసుకున్న వారిలో నియోజకవర్గానికి ముగ్గురేసి నేతలతో ఇంటర్వ్యూలాంటిది ఉంటుందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఏఐసీసీ నుండి వచ్చిన పరిశీలకుడు మయ్యప్పన్ తో పాటు జిల్లాల అధ్యక్షులతో షర్మిల తొందరలోనే సమావేశం కాబోతున్నట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ తరపున పోటీ చేయటానికి ఇన్ని దరఖాస్తులు వచ్చాయంటేనే ఆశ్చర్యంగా ఉంది.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికల్లో చాలామంది సీనియర్లు పోటీ చేశారు. అయితే వారిలో చాలామందికి డిపాజిట్లు కూడా దక్కలేదు. దాంతో జనాల్లో కాంగ్రెస్ పైన ఏ స్థాయిలో మంటుందో అందరికీ అర్ధమైపోయింది. అందుకనే 2019 ఎన్నికల్లో చాలామంది పోటీనే చేయలేదు. దాంతో కాంగ్రెస్ ఎన్ని నియోజకవర్గాలకు పోటీచేసింది ? ఎంతమందికి డిపాజిట్లు దక్కాయనే విషయం కూడా తెలీదు. అందుకనే 2024 ఎన్నికల్లో 1351 దరఖాస్తులు వచ్చాయంటే ఆశ్చర్యంగా ఉంది. షర్మిల కారణంగానే పార్టీలో కాస్త హడావుడి జరుగుతున్నట్లుంది. మరీ హడావుడి ఎంతకాలం ఉంటుందో చూడాలి.