బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో ఏపీకి నిల్..పొత్తు కోసమేనా?

మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఈ రోజు ప్రకటించింది. 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తాప్ డే విడుదల చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికలలో 400 సీట్లు సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. బిజెపికి అవలీలగా 370కి పైగా సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తొలి జాబితాలో 28 మంది మహిళలకు, 34 మంది మంత్రులకు, 47 మంది యువతీయువకులకు స్థానాలు దక్కాయి.

57 మంది ఓబీసీలు, 34 మంది మంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఎస్సీలకు 27, ఎస్టీలకు 18 స్థానాలు దక్కాయి. బెంగాల్ కు 20 స్థానాలు, మధ్యప్రదేశ్ కు 24 స్థానాలు, గుజరాత్ కు 15 స్థానాలు, రాజస్థాన్ 15 స్థానాలు, కేరళకు 12 స్థానాలు, తెలంగాణకు 9 స్థానాలు దక్కాయి. తొలి జాబితాలో భాగంగా 16 రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో సీట్లను బిజెపి ప్రకటించింది. వారణాసి నుంచి వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయబోతున్నారు.

కానీ, ఈ జాబితాలో ఏపీ నుంచి ఒక అభ్యర్థి పేరును కూడా ప్రకటించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పొత్తు పొడిచే అవకాశాలున్న నేపథ్యంలోనే ఏపీలో అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది. బిజెపి-టిడిపి-జనసేన పొత్తుపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను బిజెపి హై కమాండ్ సేకరిస్తోందని తెలుస్తోంది. పొత్తులపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చిన తర్వాతే ఏపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో, బీజేపీ తొలి జాబితాలో ఏపీకి చోటు దక్కని నేపథ్యంలో ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు ఖాయంగా కనిపిస్తోంది.