ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు అటు ఇటుగా ఇంకో 40 రోజుల సమయమే మిగిలింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుండగా.. ఇటీవలే తెలుగుదేశం-జనసేన కూటమి కూడా తొలి జాబితాను విడుదల చేసింది. అందులో అందరి దృష్టినీ ఆకర్షించిన పేర్లలో మహాసేన రాజేష్ ఒకటి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పి.గన్నవరం నుంచి అతడికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది.
ఆర్థికంగా బలహీనుడినైన తనకు అండగా నిలవాలంటూ ఎన్నికల ఖర్చు కోసం ఓవైపు విరాళాలు సేకరిస్తూ కార్యకర్తలతో సమన్వయం చేసుకునే పనిలో పడ్డాడు రాజేష్. కానీ కొన్ని రోజులు గడిచేసరికే ఇప్పుడు సంచలన ప్రకటనతో మీడియాలోకి వచ్చాడు రాజేష్. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని అతను ప్రకటించాడు.
తనను అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి తన గురించి అధికార వైసీపీ విపరీతమైన దుష్ప్రచారం చేస్తోందని.. ఏవేవో వీడియోలు పెట్టి తన ఇమేజ్‌ను దెబ్బ తీస్తోందని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు టికెట్ ఇవ్వడంపై జరిగిన గొడవల వెనుక కూడా వైసీపీనే ఉందని అతను ఆరోపించాడు.
వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి.. ఆ హత్య వెనుక ఉన్న జగన్మోహన్ రెడ్డి.. దళితుడైన తన డ్రైవర్‌ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు లాంటి వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తారని.. కానీ దళితుడైన తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని.. ఈ విషయాలు తాను గుర్తు పెట్టుకుంటానని రాజేష్ అన్నాడు. తన వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చి ఉంటే ఆ పార్టీ పెద్దలు, కార్యకర్తలు తనను మన్నించాలని.. తాను మాత్రం పోటీ నుంచి తప్పుకుంటున్నానని రాజేష్ ఆవేదన స్వరంతో చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates