చిత్తూరు జిల్లాలోని కీలకమైన ఎస్సీ నియోజకవర్గంలో ఈ సారి టీడీపీ విజయం పక్కానా? వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. చంద్రబాబు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ, ఆయన మాత్రం తనకే టికెట్ అని అనుచరులకు చెబుతున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ఆయన వైపు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో మారిన సమీకరణల నేపథ్యంలో ఈ దఫా సత్యవేడులో సైకిల్ సవారీ ఖాయమనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
సత్యవేడులో ఇప్పటి వరకు ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తే.. ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి ఆదిమూలం విజయం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి తలారి ఆదిత్య.. వైసీపీ అభ్యర్థి ఆదిమూలంపై 4,227 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం.. టీడీపీ అభ్యర్థి జె.డి.రాజశేఖర్ పై 44,744 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఇది రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థులు సాధించిన మూడో అతి పెద్ద రికార్డుగా చెబుతారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కోనేటి గెలుపు ఖాయమని అంటున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో తనకు సత్యవేడునే ఇవ్వాలని అనేక సందర్బాల్లో పార్టీ అధిష్టానానికి విన్నవించారు. అయితే.. ఆయనపై చేయించిన సర్వే కంటే.. కూడా మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన నివేదక బాగా పనిచేసిందనేది కోనేటి వర్గం ప్రధాన ఆరోపణ. ఒకానొక దశలో కోనేటి .. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సారికి ఇక్కడే టికెట్ ఇవ్వాలని కూడా వేడుకున్నారు. ఇవన్నీ.. పత్రికల్లోనూ వచ్చాయి. అయినప్పటికీ.. ఆయనను ఎంపీగా పంపించేందుకే సీఎం జగన్ ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో పార్టీ నుంచి బయటకు వచ్చిన కోనేటి ఆదిమూల.. టీడీపీ చెంతకు చేరుకున్నారు. ఇక, ఇప్పటికే ఆయనకు ఉన్న చరిష్మా.. టీడీపీ-జనసేన పొత్తుతో ఖచ్చితంగా గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ మెజారిటీతోనే విజయం దక్కించుకుం టానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇదే నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడికి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చల్లో ఉన్నట్టు తెలిసింది. అయితే.. స్థానికంగా కోనేటికి ఉన్న పలుకుబడి.. ప్రజల్లో ఉన్న సింపతీ వంటివి పనిచేస్తే.. పొత్తు కలిసి వస్తే.. ఇక్కడ సైకిల్ జోరుపెరుగుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.