ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల నాయకులు ప్రజలకు ముఖ్యంగా తమకు ఓటేస్తారో లేదో అనే అనుమానం ఉన్న వారికి తాయిలాలు పంచడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల ఓటర్లు రోడ్డెక్కి మరీ వీటిని దక్కించుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక, ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. ఇక్కడ ఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అభ్యర్థులుతాయిలాల పంపిణీలో అప్పుడే ప్రారంభించశారు. దీనికి ప్రధాన కారణం.. ఒకనియోజకవర్గం వారిని వేరే నియోజకవర్గంలో నియమించడమే.
దీంతో వారు.. తమ గురించి తెలియని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో చిన్న, పెద్ద నేతలు చేతిలో చీర, కుక్కర్లు, వాచీలాంటి ఏదో ఓ ఉపకరణంతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రాత్రిళ్లు ఇంటింటికీ తలుపుకొట్టి మరీ తాయిలాలు పంచుతున్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అనుచరులు, వైసీపీ నాయకులు చీకటి పడగానే ఆయా గ్రామాల్లో వాలంటీర్లను వెంటేసుకొని కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు.
ఇటీవల ఎమ్మెల్యే సతీమణి వలంటీర్లతో సమావేశమై సూచనలిచ్చారు. కుక్కర్ బాక్స్‌పై ‘ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సీఎం జగన్, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్’ అనే స్టిక్కరు వేసి మరీ ఓటేయాల్సిన గుర్తును గుర్తుచేస్తున్నారు. పార్వతీపు రం మన్యం జిల్లాలో పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు ఈ నెల 3న సీతానగరం మండలం పణుకుపేటలో మహిళకు చీర, రూ.500 ఇచ్చారు. గ్రామస్థాయి నాయకులు అప్పట్నుంచి రోజూ కొన్ని గ్రామాలు ఎంచుకొని పంపకాలు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ‘వాలంటీర్లకు వందనం’ కార్యక్రమంలో కొందరికే నగదు బహుమతులు అందాయని మిగిలిన వారికి వాచీలు అందజేశారు. వీటిని పంచాయతీ కార్యాలయాల్లోనే వైసీపీ సర్పంచులు బాహాటంగా అందజేయడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంచార్జ్‌గా కొత్తగా నియమితులైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా.. వలంటీర్లకు ముందుగా కుక్కర్లు, కొంత నగదు(అవసరమైన వారికి) ఇచ్చి ఆకట్టుకున్నారు. ఇక, టీడీపీకి అనుకూలంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వారిని ఆకట్టుకునేందుకు చీరలు, వెండి వస్తువులు పంపిణీ చేయడం గమనార్హం.ఇప్పుడు ఎన్నికల కోడ్ లేకపోవడంతో ఎవరూ వీరిని అడ్డుకోలేని పరిస్థితి ఉండడం కలిసి వస్తోందని నాయకులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates