కొడుకు ‘యువగళం’.. తండ్రి ‘ప్ర‌జాగ‌ళం’

టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌రోవినూత్న కార్య‌క్ర‌మంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రానున్నారు. వ‌చ్చే నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేలా పార్టీ రూప‌క‌ల్ప‌న చేసింది. దీనికి ప్ర‌జా గ‌ళం అని పేరుపెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐదు రోజుల పాటు నిర్విరామంగా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండ‌నున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోనున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పాద‌యాత్ర‌లు కూడా చేయ‌నున్నారు.

ప్ర‌జాగ‌ళం కార్య‌క్ర‌మంలో కేవ‌లం చంద్ర‌బాబు మాత్ర‌మే పాల్గొంటార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో పూర్తిగా ప్ర‌చారానికి ఆయ‌న ప‌రిమితం అవుతారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మం ద్వారా ముఖ్యంగా మ‌హిళా ఓటు బ్యాంకుపై చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌నున్నారు. సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల‌తోపాటు.. మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తామ‌ని.. ప‌థ‌కాల‌ను తీసుకువ‌స్తా మ‌ని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న వివ‌రించ‌నున్నారు.

మెజారిటీగా ఈ కార్య‌క్ర‌మం ద్వారా ఆయ‌న గ్రామీణ ప్రాంతాల‌పై ప‌ట్టు పెంచుకునే ఉద్దేశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌తంలో నారా లోకేష్ యువ‌గ‌ళం పేరుతో కార్య‌క్ర‌మం నిర్వ‌హించి 3 వేల కిలో మీట‌ర్ల‌కు పైగానే పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అదే పేరును కొంత మేర‌కు మార్చి ప్ర‌జాగ‌ళంగా పేరు పెట్టిన‌ట్టు టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

ఇక‌, ఇప్ప‌టికే చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి చేస్తున్న నిజంగెల‌వాలి యాత్ర‌ను ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌ర‌కు పొడిగించారు. నారా లోకేష్ శంఖారావం యాత్ర‌లుచేయ‌నున్నారు. మొత్తంగా టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల షెడ్యూల్‌లోపు మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌నుండ‌డం గ‌మ‌నార్హం.