నిజంగెల‌వాలి.. ఎన్నిక‌లు వ‌చ్చేదాకా!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నిజం గెలవాలి పేరుతో ఆయ‌న స‌తీమ‌ణి నారా భువనేశ్శరి పరామర్శిస్తున్నారు. ఇప్పటివరకూ 8 టూర్లలో కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి చెక్కులు ఇచ్చి ఆర్థిక సహాయం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తల కుటుంబాలకు సాయం చేయడంలో భువనేశ్వరి అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటికే ప‌రిమిత‌మైన ఆమె.. రాజ‌కీయంగా కూడా దూకుడు పెంచారు. వైసీపీని అంతం చేసేందుకు క‌లిసి రావాల‌ని పిలుపునిస్తున్నారు.

దీంతో నిజం గెల‌వాలి యాత్ర‌ల‌కు జోష్ పెరిగింది. వాస్త‌వానికి ఈ షెడ్యూల్ మార్చి 1నే ముగిసిపోవాల్సి ఉంది. అయితే.. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. దీనిని మ‌రింత‌గా ముందుకు తీసుకువెళ్లాల‌ని టీడీపీ నిర్ణ‌యించింది. ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే వ‌ర‌కు అంటే.. మ‌రో రెండు వారాల పాటు దీనిని కొన‌సాగించ నున్నారు. దీంతో క్షేత్ర‌స్తాయిలో మ‌హిళ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనే అవ‌కాశం ఉంటుంద‌ని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.

ఇక‌, ఈ నిజంగెల‌వాలి యాత్ర ద్వారా బాధితుల‌కు రూ.3 ల‌క్ష‌ల చొప్పున చేస్తున్న‌ సాయం విష‌యంలోనూ విధానాన్ని మార్చేశారు. పరామర్శకు వెళ్లకముందే కార్యకర్తల కుటుంబాల అకౌంట్స్ లోకి సాయాన్ని జమ చేస్తున్నారు. దాంతో కార్యకర్తల కుటుంబాలు చెక్కులను బ్యాంకులకు తీసుకెళ్లే పని లేకుండా సాయం అందిస్తున్నారు. ఇప్పటివరకూ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భువనేశ్వరి చెక్కులు అందజేశారు. ఇకనుంచి పరామర్శకు వెళ్లేముందు బాధిత కార్యకర్తల కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక సాయాన్ని జమ చేయాలని నిర్ణయించారు.

దీంతో చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేసే పని లేకుండా.. నేరుగా బ్యాంకు కు వెళ్లి డబ్బులు తెచ్చుకు నేలా విధానాన్ని సరళతరం చేశారు. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి, ఆర్ధిక సాయాన్ని అందించిన విషయాన్ని తెలిపే లెటర్ ను మాత్రం ఇవ్వనున్నారు. భువనేశ్వరి ఇచ్చే లెటర్ లో కార్యకర్తల పట్ల పార్టీ, పార్టీ అధినేత, కుటుంబ సభ్యుల నిబద్దతను తెలిపేలా వివరాలను పొందుపరిచారు. మొత్తానికి ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌ర‌కు.. ఎలాంటి నిబంధ‌న‌లు లేనందున దీనికి పొడిగింపు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.