తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఖరారై సీట్ల పంపిణీలో కూడా ఒక అవగాహనకు వచ్చాక కొన్ని రోజుల కిందటే అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఉమ్మడి ప్రెస్ మీట్‌తోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లయింది. ఆ తర్వాత తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం ‘జెండా’ పేరుతో తొలి ఉమ్మడి బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం యువనేత, నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాకపోవడం చర్చనీయాంశం అయింది.
బాలయ్య కూడా హాజరైన ఈ సభకు లోకేష్ ఎందుకు రాలేదన్న దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. సీట్ల పంపిణీ విషయమై జనసైనికుల్లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సభ ద్వారా సానుకూల సందేశం ఇవ్వడం.. జనసేనను, పవన్ కళ్యాణ్‌కు హైలైట్ చేసి జనసైనికులను శాంతింపజేయడమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటు చేశారని.. అందుకే నారా లోకేష్ ఈ సభను అవాయిడ్ చేశాడని స్పష్టమవుతోంది.
యువగళం ముగింపు సభకు పవన్ హాజరైనపుడు అది లోకేష్ కార్యక్రమం కాబట్టి తాను ఎక్కువగా మాట్లాడకుండా టీడీపీ యువనేతనే హైలైట్ అయ్యేలా చేశారు. ‘జెండా’ సభ విషయానికి వస్తే దానికి తాను హాజరై టీడీపీ వాళ్లు హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుండదని భావించి.. అందులో పవనే ప్రధాన ఆకర్షణ కావాలని లోకేష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే నిన్నటి జెండా సభ ‘జనసేన’కు సొంతం. ఆ పార్టీకి, అధినేతకు, కార్యకర్తలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని.. వారిని గౌరవిస్తామని చెప్పడానికే ఈ సభను టీడీపీ ఏర్పాటు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సభకు ఏర్పాట్లు పూర్తిగా తెదేపానే చేసింది. సభలో పూర్తిగా పవనే హైలైట్ అయ్యేలా చూసింది.
వాస్తవంగా పార్టీల స్థాయి, అనుభవం దృష్ట్యా ఈ సభలో చివరగా మాట్లాడాల్సింది చంద్రబాబు. కానీ ఆయన ఒక స్టెప్ వెనక్కి వెళ్లి ముందే ప్రసంగం పూర్తి చేశారు. పవన్‌కు చివరగా అవకాశమిచ్చారు. అంటే ఈ సభలో ముఖ్య ప్రసంగీకుడిగా పవన్‌ను ముందు నిలబెట్టారు. ఇది చంద్రబాబు హుందాతనానికి నిదర్శనం. జనసేనానిని గౌరవించిన తీరు.. జనసైనికులకు ఎంతో ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా పవన్ కూడా సీట్ల పంపిణీ విషయంలో తనను ప్రశ్నిస్తున్న, విమర్శిస్తున్న వారికి సూటిగా చెప్పాల్సింది చెప్పేశారు. ఈ సభ జనసైనికుల్లో కచ్చితంగా మార్పు తీసుకొస్తుందని.. ఇక టీడీపీతో కలిసి పని చేయడానికి వాళ్లు సిద్ధంగా ఉంటారని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates