రాజకీయాల్లో నాయకులు అనుకుంటే కానిదేముంది? ముఖ్యంగా అధినేతలు తలుచుకుంటే జరగనిది ఏముంటుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి పరిణామమే జరిగింది. బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేయడం.. సాయంత్రానికి గ్రీన్ సిగ్నల్ రావడం.. సీనియర్ ఐఏఎస్ ఇంతియాజ్ విషయంలో చకచకా జరిగిపోయాయి. అంతేకాదు.. ఆయన గురువారం ఉదయం సీఎం జగన్‌ను కలుసుకోవడం.. ఆయన ఆశీర్వాదంతో వైసీపీలోకి చేరిపోవడం కూడా అయిపోయాయి.
తాజాగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాజా మాజీ ఐఏఎస్ ఇంతియాజ్.. వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఆయనతోపాటు.. ఆయన సోదరుడు కూడా పార్టీలోకి చేరిపోయారు. ఇక, కొద్ది మంది బంధువులు కూడా పార్టీలోకి చేరేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. కర్నూలు అసెంబ్లీ సీటును వైసీపీ ఈయనకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మైనారిటీ కోటాలో ఇంతియాజ్ ను తీసుకురావడం గమనార్హం.
అయితే.. వైసీపీ చేసిన ఈ ప్రయోగం కొత్తకాదు. మైనారిటీలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో వైసీపీ అధినేత జగన్.. గత 2019 ఎన్నికల వేళ కూడా.. ఇలాంటి ప్రయత్నాలు చేశారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మైనారిటీ నాయకుడు, అప్పటి ఐఆర్ ఎస్ అధికారి.. మహమ్మద్ ఇక్బాల్‌ను పరిచయం చేశారు. ఆయన అదే తొలిసారి వైసీపీలోకి వచ్చారు. వచ్చీరావడంతోనే స్థానికులను కాదని.. ఈయనకు అవకాశం ఇచ్చారు.
అయితే.. హిందూపురంలో బాలయ్య ముందు ఈయన నిలబడలేక పోయారు. మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. స్థానిక స్థితిగతులు పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా.. చేసిన ఆ ప్రయత్నం.. విఫలమైంది. ఇక, ఇప్పుడు కర్నూలు అసెంబ్లీ నియోజకరవ్గంలోనూ జగన్ ప్రయోగం చేస్తున్నారు. మరి ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. ఇక్కడ నుంచి పోటీకి చాలా మంది ఉన్నా.. వారిని పక్కన పెట్టడం గమనార్హం.