“అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకొంటా. ఇప్పటికే అన్ని విధాలా సర్దుకుని రాజకీయాల్లో ఉన్నా. పైగా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి” అని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మె ల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒంగోలు పేద ప్రజల కోసం ఇళ్ల పట్టాలను ఇవ్వాలని అడిగానని.. ఇది తన స్వార్థం కోసం కాదని బాలినేని చెప్పారు. అయితే.. ఇదేదో తన ఇంట్లో కార్యక్రమం మాదిరిగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారని.. పార్టీకి చెడు సంకేతాలు ఇచ్చారని బాలినేని విమర్శించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన బాలినేని.. సీఎం జగన్‌పైనా పరోక్షంగా విమర్శలు చేశారు. “నేను సీఎం జగన్‌ని ఏదైనా అడిగితే వాసు అలిగాడని అంటున్నారు” అని వ్యాఖ్యానించారు. తాను అలిగింది ప్రజల కోసమేనని చెప్పారు. అది కూడా గూడు లేని ప్రజల కోసమేనని, రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి ఇళ్లు ఇచ్చిన మన పార్టీ.. కేవలం 25 వేల మందికి ఇళ్లు ఇవ్వలేకపోతే.. నగుబాటు తప్పదని అలిగానని చెప్పారు. “ఒంగోలు నియోజకవర్గంలోని 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని హైదరాబాద్‌లో కూర్చున్నా. దీనిని సీఎం సహా అందరూ తప్పుబట్టారు. వాసు వస్తే గట్టిగా అడుగుతున్నాడని సీఎం ఇంటెలిజెన్స్ అధికారులతో అంటున్నారు” అని బాలినేని చెప్పారు.
ప్రజల్లో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని బాలినేని వ్యాఖ్యానించారు. సీఎం దగ్గర అందరిలాగా తాను డబ్బాలు కొట్టనని, కనీసం పొగిడే ప్రయత్నం కూడా చేయనని చెప్పారు. అయితే.. ఇలా చేయకపోవడం వల్ల చాలానే కోల్పోయానని.. అయినా ఇది ఇష్టమేనని.. అయిన వారికి ఏమీ చేయలేక పోయానని.. పరోక్షంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇప్పించుకోలేక పోయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. టికెట్ ఇవ్వనందునే మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబం టీడీపీలోకి వెళ్తోందని చెప్పారు. ఇది ఎఫెక్ట్ చూపిస్తందుని బాలినేని వ్యాఖ్యానించారు.
నేను వెళ్లను!
మాగుంటకు టికెట్ ఇవ్వాలని పట్టుబట్టిన మాట వాస్తవమేనని బాలినేని చెప్పారు. అయితే, ఆయనకు ఇవ్వలేదని.. దీంతో ఆయన తన దారి తాను చూసుకున్నారని.. ఇప్పుడు తాను కూడా టీడీపీలోకి వెళ్తానని కొందరు ప్రచారం చేస్తున్నారని.. అలా ఎప్పటికీ జరగదని.. అవసరమైతే.. రాజకీయాలనుంచి తప్పుకొంటానని బాలినేని చెప్పారు. తన మనసుకు నచ్చే పార్టీలో ఉంటున్నానని..పార్టీకి ద్రోహం చేసే మనస్తత్వం తనది కాదని చెప్పారు. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని.. ఆపై తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని బాలినేని చెప్పారు.