జగన్ ఓపెన్ చేసిన గేట్ ఏమైంది?

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో మొన్న సీఎం జగన్ సభ ఎంతో ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే. తన సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నీళ్లు ఇచ్చుకోలేకపోయాడని.. కానీ తమ ప్రభుత్వం మాత్రం ఎంతో చిత్తశుద్ధితో ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తోందని ఆయన ఘనంగా ప్రకటన చేశారు. ఈ పర్యటనలో జగన్ బటన్ నొక్కడం.. గేట్ నుంచి హంద్రీ నీవా నీళ్లు బయటికి రావడం తెలిసిందే. సంబంధిత వీడియోను వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఐతే ఒక్క రోజు గడిచిందో లేదో.. జగన్ ఓపెన్ చేసిన గేటే అక్కడ లేకుండా మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ పర్యటన ముగిసిన తర్వాతి రోజు.. జేసీబీతో ఆ గేటును ఊడబీకించి అక్కడి నుంచి తరలించేయడం గమనార్హం.

కేవలం జగన్ పర్యటన కోసం తాత్కాలికంగా ఆ గేట్ ఏర్పాటు చేసి, కొంత మొత్తంలో నీళ్లు స్టోర్ చేయించి వాటిని బయటికి వదిలినట్లు స్పష్టమవుతోంది. ఆయన పర్యటన ముగియగానే అక్కడి నుంచి గేట్ తీయించేశారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆ ప్రాంతానికి వచ్చి ముందు రోజు నీళ్లు పారిన చోట కూర్చుని అక్కడ గేటు, నీళ్లు రెండూ లేని విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. వైసీపీ వాళ్లు వైరల్ చేసిన వీడియోను మించి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.

కుప్పం ప్రాంతానికి నీళ్లు ఇచ్చినట్లు బయటి వాళ్లను మభ్యపెట్టవచ్చు కానీ.. ముందు రోజున్న గేట్ ఇప్పుడు లేకపోవడం, నీళ్లు రాకపోవడం ఆ ప్రాంత ప్రజలకు తెలిసిపోతుంది కదా.. దీని వల్ల జగన్ ప్రభుత్వం మరింత అన్‌పాపులర్ అవుతుంది కదా అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. బాబు ప్రభుత్వంలో 80 శాతం పూర్తయిన హంద్రీ నీవా ప్రాజెక్టు పనులను మూడేళ్లకు పైగా ఆపించేసి, ఎన్నికల ముందు జగన్ సర్కారు స్టంట్లు చేస్తోందంటూ టీడీపీ మద్దతుదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.