పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు బీఆర్ఎస్‌కు భారీ షాక్‌!

పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు కేవ‌లం 40 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంద‌ని తెలుస్తోంది. ఈ లోగానే షెడ్యూల్ కూడా వ‌చ్చేసేందుకు రెడీగా ఉంది. అయితే.. ఇంత‌లోనే తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌లో క‌ల‌క‌లం రేగింది. పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేయ‌డం లేద‌ని.. పార్టీ ప‌రిస్థితి అగ‌మ్యంగా ఉంద‌ని నేత‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ముఖ్య నేత‌, ఎంపీ ఒక‌రు పార్టీ నుంచి జంప్ చేసేశారు.

నాగర్‌కర్నూల్‌ ఎంపీ, బీఆర్ఎస్ నేత పోతుగంటి రాములు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నేడు ఆయన బీజేపీలో చేరారు. బీఆర్‌ఎస్‌లో ఇటీవల తనకు ఎదురైన పరిణామాలు తనను అవమానపరిచేలా ఉన్నాయని ఎంపీ రాములు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ లేదా బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. ఆయన తాజాగా బీజేపీలో చేరారు. వాస్త‌వానికి బీజేపీపై యుద్ధం ప్ర‌క‌టిస్తున్నామ‌ని కీల‌క నేత‌లు .. చెప్పుకొచ్చారు. అయితే.. ఇంత‌లోనే ఎంపీ పార్టీ మారి క‌మ‌లం గూటికి చేరుకోవ‌డంతో షాక్ త‌గిలినంత ప‌నిజ‌రిగింది.

టికెట్ కోస‌మేనా?

కాగా, పోతుగంటి రాములు బీఆర్ ఎస్ నుంచి బీజేపీలోకి చేర‌డం వెనుక కేవ‌లం టికెట్ కోస‌మేననే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌స్తుతం బీఆర్ ఎస్‌లో సిట్టింగు ఎంపీల‌ను మారుస్తామ‌ని… ప్ర‌జ‌ల అభిప్రాయం మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇక‌, కొన్నాళ్ల కింద‌ట కేటీఆర్ నాగ‌ర్ క‌ర్నూలులో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఎంపీగా ఉన్న రాములుకు స‌మాచారం ఇవ్వలేదు. దీంతో త‌న‌కు టికెట్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని.. రాములు అప్ప‌ట్లోనే కామెంట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో క‌నీసం ఎలాంటి ముంద‌స్తుస‌మాచారం లేకుండానే ఆయ‌న బీజేపీ కండువా క‌ప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.