నారా లోకేష్‌ బ‌లహీన‌త‌లు కాదు బ‌లం చూడు!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ప్ర‌జ‌ల ఆశీస్సులు.. ఎన్నిక‌ల మూడ్ వంటివి నాయ‌కుల‌ గెలుపోటములను ప్ర‌భావితం చేస్తాయి. ఎవ‌రూ ఎప్పుడూ విఫ‌లం కావాల‌ని కూడా ఉండ‌దు.  ఇదే ఫార్ములాను.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ యువ నాయ‌కుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఫాలో అవుతున్నారు. 2019లో తొలిసారి ఆయ‌న మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేశారు. అప్ప‌టి అంచ‌నాల మేర‌కు.. ఆయ‌న విజ‌యం `ప‌క్కా` అని టీడీపీ నాయ‌కులు రాసిపెట్టుకున్నారు. రాజ‌ధానిగా ఇక్క‌డి అమ‌రావ‌తి ప్రాంతాన్ని ఎంపిక‌ చేయ‌డం.. యువ నాయ‌కుడిగా ప్ర‌జ‌ల్లో ఉండడం. హైప్రొఫెల్ నాయ‌కుడిగా నారా చంద్ర‌బాబు భారీ గుర్తింపు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న‌ వార‌సుడిగా  లోకేష్ గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని భావించారు.

కానీ, 2019లో ఈ లెక్క‌లు విఫ‌ల‌మ‌య్యాయి. అప్ప‌టి ఎన్నిక‌ల్లో వ‌రుసగా పోటీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే.. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోరు సాగింది. టీడీపీ, వైఎస్సార్ సీపీల‌తో పాటు.. జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టుల మిత్రప‌క్షం త‌ర‌ఫున ముప్పాళ్ల నాగేశ్వ‌ర‌రావు పోటీ చేశారు. దీంతో ఓట్లు చీలిపోయి.. నారా లోకేష్ 5,333 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వ‌రుస విజ‌యాలు దక్కించుకున్నారు. అయితే, త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఇక్క‌డ నుంచే నారా లోకేష్ పోటీకి రెడీ అయ్యారు.

గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన‌ప్ప‌టికీ.. ప‌డిన చోటి నుంచే పైకి లేవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న పట్టుదలగా ఇక్క‌డ‌ పని చేసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హిస్తున్నారు. దీంతో మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ ఓడిపోయినా.. ఆయ‌న హ‌వా మాత్రం చెక్కు చెద‌ర‌లేదనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు చేనేత‌లు ఎక్కువ‌గా ఉండ‌డంతో వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. వీధి వ్యాపారుల‌కు తోపుడు బండ్లు ఇచ్చి..వారిని ప్రోత్స‌హిస్తున్నారు. మ‌రోవైపు.. నారా లోకేష్ స‌తీమ‌ణి నారా బ్రాహ్మ‌ణి కూడా ప‌ర్య‌టిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త నారా లోకేష్‌ను గెలిపించాల‌ని ఆమె కోరుతున్నారు.  

నారా లోకేష్ బలాలు ఇవీ..
 గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌న్న సానుభూతి,  అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు. యువ‌గ‌ళం పాద‌యాత్ర తాలూకు సింప‌తీ. బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తార‌నే చ‌ర్చ‌. స్థానికంగా చేప‌ట్టిన అన్నా క్యాంటీన్ వంటి.. కార్య‌క్ర‌మాలు. యువ నాయ‌కుడు, యువ‌త‌ను ప్రోత్స‌హిస్తున్న‌తీరు.. వంటివి ఆయ‌న‌కు ప్ర‌ధానంగా బ‌లం చేకూరుతున్నాయి. ఇదేస‌మ‌యంలో కొన్ని బ‌ల‌హీన‌త‌లు కూడా ఉన్నాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కాక‌పోవ‌డం, బీసీ సామాజిక వ‌ర్గ‌మైన చేనేత‌ల్లో బ‌ల‌మైన ఓటు బ్యాంకును ఈయ‌న త‌న‌వైపు తిప్పుకోలేక‌పోతున్నార‌నే వాద‌న ఉంది. అయిన‌ప్ప‌టికీ.. గెలుపుపై అంచ‌నాలు మాత్రం ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్మం.