పవన్ కు జోగయ్య లేఖ..చంద్రబాబునూ ఇరికించారు

టీడీపీ-జనసేన పొత్తుల నేపథ్యంలో విడుదలైన అభ్యర్థుల తొలి జాబితాపై కొంతమంది టీడీపీ-జనసేన నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు పార్టీల అధినేతలకు అసంతృప్త నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తూ చర్చలు జరుపుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు కొందరు తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు చేగొండి హరి రామ జోగయ్య రాసిన లేఖ సంచలనం రేపుతోంది.

ఒకవేళ టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే అందులో పవన్ కళ్యాణ్ అధికారం ఎంత? చంద్రబాబు అధికారం ఎంత? అనే విషయాన్ని స్పష్టం చేయాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. అంతేకాదు, రేపు తాడేపల్లిగూడెంలో జరగబోతున్న బహిరంగ సభలో ఈ విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై తాను అసంతృప్తితో ఉన్నానని చెప్పకనే చెప్పిన రామ జోగయ్య…టీడీపీ-జనసేన కూటమికి రాజ్యాధికారం లభిస్తే అందులో పవన్ పాత్ర ఏమిటి అని ప్రశ్నించారు.

కూటమిలో కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు? అందులో పవన్ పాత్ర ఏమిటో చంద్రబాబు పాత్ర ఏమిటో చెప్పకుండా ముందుకు సాగడానికి వీల్లేదని కూడా ఆయన చేసిన కామెంట్లు ఆసక్తి రేపుతున్నాయి. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ కు గౌరవప్రదమైన హోదా ఇవ్వాలని, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే నిర్ణయాలు తీసుకోగలిగే విధంగా సర్వాధికారాలతో ఆ హోదా ఉండాలని హరిరామజోగయ్య మరీమరీ చెప్పారు. ఆల్రెడీ సీట్ల పంపకం విషయంలో నిరసనను ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ కు ఈ లేఖ ఇబ్బందికరంగా మారింది.

మరి ఈ లేఖపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా జనసేనకు కనీసం 60 నుంచి 70 సీట్లు డిమాండ్ చేయాలని, ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూచిస్తూ హరి రామ జోగయ్య రాసిన లేఖలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.