రాబోయే ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్లో బీసీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అందరు అనుకుంటున్నదే. అందుకనే ఏ పార్టీ అయినా బీసీలకే టాప్ ప్రయారిటి ఇస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బీసీలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు టీడీపీ, జనసేన కూడా అదే బాటలో నడుస్తున్నాయి. తాజాగా ప్రకటించిన 99 మంది మొదటిజాబితాలో ఉత్తరాంధ్ర విషయం తీసుకుందాం. ఉత్తరాంధ్రలోని వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిల్లో రెండు పార్టీలు కలిపి 17 సీట్లను ప్రకటించాయి.
ఈ 17 సీట్లలో జనసేన ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించగా మిగిలిన 15 చోట్ల టీడీపీ ప్రకటించింది. జనసేన ప్రకటించిన రెండు సీట్లు నెల్లిమర్లలో లోకం మాధవి, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణలు ఇద్దరు బీసీలే. ఇక కొణాతల అయితే గవర సామాజికవర్గం. ఇక టీడీపీ ప్రకటించిన 15 మంది అభ్యర్ధుల్లో ఆరుగురు బీసీలే. బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్ ను ఇచ్చాపురంలో, ఆముదాలవలసలో కూనరవికుమార్ ను, కొప్పుల వెలమకు చెందిన అచ్చెన్నాయుడుకు టెక్కలి టికెట్ ఇచ్చారు.
విజయనగరం టికెట్ కొండపల్లి శ్రీనివాస్, బొబ్బిలిలో బేబీనాయనకు కూడా టికెట్ దక్కింది. విశాఖ పశ్చిమ సీటును గవర సామాజిక వర్గానికి చెందిన గణబాబు, నర్సీపట్నంలో కొప్పుల వెలమ అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీచేయబోతున్నారు. ఏ విధంగా చూసుకున్నా రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక మ్యాగ్జిమమ్ సామాజిక సమీకరణల మీదే ఆధారపడుంటుందని అర్ధమవుతోంది.
వైసీపీ, టీడీపీనే కాదు ఏ పార్టీ గెలుపు రేసులో ఉండాలని అనుకున్నా సామాజికవర్గాల సమతూకాన్ని పాటించక వేరే దారిలేదు. కాకపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే బీసీల్లోనే వివిధ సామాజికవర్గాలకు చెందిన కీలక నేతలంతా ఎక్కువగా వైసీపీ, టీడీపీల్లో సర్దేసుకుంటారు. మిగిలిన అరాకొరా నేతలు జనసేన తరపున పోటీచేస్తే చేయచ్చంతే. కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే నేతలను కూడా ఇదే పద్దతిలో ఎంపికచేసినా వాళ్ళ ప్రభావం దాదాపు శూన్యమనే అనుకోవాలి. ఇక, బీజేపీ, వామపక్షాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates