నరసరావుపేటకు షిఫ్ట్ చేస్తున్నారా ?

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో గట్టినేతగా పేరున్న మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావును నియోజకవర్గం షిఫ్ట్ చేస్తున్నారా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. పల్నాడు ప్రాంతంలోని గురజాల అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకమైంది. ఇక్కడ నుండి యరపతినేని ఆరుసార్లు పోటీచేసి మూడుసార్లు గెలిచారు. ఆర్ధిక, అంగ బలాలు పుష్కలంగా ఉన్న యరపతినేని పార్టీకి చాలా అండగా ఉంటున్నారు. ఇలాంటి యరపతినేనికి మొదటిజాబితాలో చోటు దక్కలేదు.

రాబోయేఎన్నికల్లో పోటీచేయబోయే 94 మంది అభ్యర్ధుల పేర్లను చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. 94 మంది జాబితాలో గురజాల నియోజకవర్గంలేదు. దాంతో గురజాలలో యరపతికి ఎందుకు టికెట్ ఇవ్వలేదని మొదట్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. అయితే తర్వాత పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే యరపతినేనిని నియోజకవర్గం మారుస్తున్నారని తెలిసింది. అంటే గురజాల నుండి నరసరావుపేటకు మార్చబోతున్నట్లు సంకేతాలు కనబడుతున్నాయి. 1999 తర్వాత నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదన్నది వాస్తవం. కాబట్టి ఈ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

అందుకనే యరపతినేనిని నరసరావుపేటలో పోటీచేయించాలని అనుకుంటున్నారట. ఈ నియోజకవర్గంలో నేతలు కూడా యరపతినేనిని స్వాగతిస్తున్నారు. నరసరావుపేటలో గెలవటం కష్టమని అర్ధమైపోయిన తర్వాతే చివరి నిముషంలో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లికి మారారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబు ఎలాగైనా సరే రాబోయే ఎన్నికల్లో ఇక్కడ పార్టీ అభ్యర్ధి గెలవాల్సిందే అని ప్రిస్టేజిగా తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే యరపతినేనితో చంద్రబాబు చాలాసార్లు మాట్లాడారు.

నియోజకవర్గంలోని అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత యరపతినేనిని అభ్యర్ధిగా ప్రకటించాలని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. అందుకనే మొదటిజాబితాలో నియోజకవర్గాన్ని పెండింగులో పెట్టారు. యరపతినేని నరసరావుపేటలో పోటీచేస్తే మరి గురజాలలో ఎవరు పోటీచేస్తారు ? అన్నది కీలకమైంది. ఇక్కడ నుండి ఎవరో గట్టి అభ్యర్ధిని పోటీలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.  మరి చంద్రబాబు ఆలోచనల్లో అభ్యర్ధిగా ఎవరున్నారో స్పష్టంగా తెలీటంలేదు. ఏదేమైనా తొందరలోనే నరసరావుపేట, గురజాలలో చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించేయటం ఖాయం. అప్పుడు సమీకరణలు మారిపోవటం ఖాయం.