నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్దిరోజులుగా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనను గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించగా ఆయన ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే లావు త్వరలోనే టిడిపిలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కూడా పలుమార్లు భేటీ అయ్యారని మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
అయితే, తాను టిడిపిలో చేరుతున్నట్టుగా లావు ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదు. ఈ క్రమంలోనే తాజాగా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు లావు బహిరంగ లేఖ రాశారు. త్వరలోనే తాను టిడిపిలో చేరబోతున్నానని లావు ఆ లేఖలో పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ప్రజలు తనపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపించారని, వాటిని ఎన్నటికీ మరువలేనని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన తదుపరి రాజకీయ కార్యచరణ గురించి అందరూ అడుగుతున్నారని, ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని లావు చెప్పారు. ఇక, టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో త్వరలోనే టిడిపిలో చేరుతున్నారని అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి తనవంతు కృషి చేశానని లావు చెప్పుకొచ్చారు. గతంలో మాదిరిగానే మరోసారి తనకు ఎంపీగా అవకాశం ఇస్తే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడుపుతానని అన్నారు. పల్నాడు వాసుల దశాబ్దాల కల అయిన వరికపూడిసెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి వారి చిరకాల కోరికను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. ఇక, నరసరావుపేటలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను వైసిపి లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దింపిన సంగతి తెలిసిందే.