తొలి జాబితాపై బాబు హ్యాపీ..

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ-జ‌న‌సేన మిత్రప‌క్షం 118 స్తానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే ఇక‌, మిగిలిన కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. బీజేపీ క‌ల‌సి వ‌స్తే.. అంటూ. చంద్ర‌బాబు ఇటీవ‌ల వ్యాఖ్య‌లు చేశారు.ఒకవేళ ఆ పార్టీ క‌లిసి వ‌చ్చినా.. 10-15 సీట్ల‌లోపే అవ‌కాశం ఇస్తారు. మిగిలి స్థానాల్లో అంటే.. 42లో టీడీపీ పోటీ చేయ‌నుంది. అయితే.. జ‌న‌సేన నుంచి అభ్య‌ర్థులు ఎక్కువ‌గా ఉండ‌డంతో మ‌రో 5-10 సీట్లు ఆ పార్టీకి ఇచ్చే ఆలోచ‌న‌తో టీడీపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఇప్ప‌టికిప్పుడు 30 స్థానాల‌పై దృష్టి పెట్టారు. ఆయా స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను కొలిక్కి తెచ్చేస్తే.. ఇక‌, ప్ర‌ధాన క్ర‌తువు పూర్త‌వుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇక‌. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన 94 స్థానాల‌(టీడీపీ)కు భారీ ఇబ్బందులు వ‌స్తాయ‌ని అనుకున్నా.. అనుకున్న విధంగా ఏమీ సంచ‌ల‌నాలు చోటు చేసుకోలేదు. కేవ‌లం 5 నుంచి 6 నియోజ‌క‌వ‌ర్గాల‌లోనే నాయ‌కులు అసంతృప్తితో ర‌గులుతున్నారు. వీరిని బుజ్జ‌గిస్తున్నారు. దీంతో తొలి జాబితా స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఇక‌, ఇప్పుడు మ‌లిజాబితా స‌హా 22 ఎంపీ సీట్ల‌పై క‌స‌రత్తు ప్రారంభించారు. అయితే.. వీటిలో 4 సీట్ల‌ను బీజేపీ ఆశిస్తున్న నేప‌థ్యంలో మొగిలిన 18 స్థానాల్లో టీడీపీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసే ప‌నిని పూర్తి చేసేలా చంద్ర‌బాబు ఇంటి నుంచి క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే విజ‌యం సాధించ‌గా.. ఒక‌రు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. దీనికి తోడు ఒక‌రు(గ‌ల్లా జ‌య‌దేవ్‌) రాజ‌కీయాల‌కు ఏకంగా దూర‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో మిగిలిన 17 స్థానాల్లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌పాల‌ని నిర్ణ‌యించుకున్నారు.