ర‌మ‌ణ దీక్షితులుపై వేటు.. టీటీడీ సంచ‌ల‌న నిర్ణ‌యం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క‌మండ‌లి బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆల‌య గౌరవ ప్ర‌ధాన అర్చ‌కుడి హోదాలో ఉన్న ర‌మ‌ణ దీక్షితులును ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించింది. వాస్త‌వానికి ఆయ‌న‌ను గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలోనే ప‌క్క‌న పెట్టారు. దీనిపై న్యాయ‌పోరాటం కూడా జ‌రిగింది. న్యాయ‌స్థానం కూడా ర‌మ‌ణ దీక్షితులుకు ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌లేదు. అయితే.. త‌ర్వాత వ‌చ్చిన వైసీపీ ఆయ‌న‌కు ప్ర‌ధాన అర్చ‌క‌త్వం బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ఇది మ‌రోసారి వివాదంగా మార‌డంతో ఆయ‌న‌ను గౌర‌వ ప్ర‌ధాన అర్చ‌కుడిగా బాథ్య‌త‌లు అప్ప‌గిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2020 ప్ర‌ధ‌మార్థం నుంచి ఆయ‌న ఆ ప‌ద‌విలో ఉన్నారు. స్వ‌యంగా స్వామి వారిని ఆయ‌న పూజించుకునే అవ‌కాశం దీనివ‌ల్ల ల‌భించింది. అయితే.. ఆయన‌కు ఎలాంటి అధికారాలు లేవు. కేవ‌లం పూజ చేసుకుని వెళ్లిపోవ‌డమే. అర్చ‌క నిర్వ‌హ‌ణ‌లో ఆయ‌న‌సూచ‌న‌ల‌ను కూడా పాటించాల‌ని ఏమీ లేదు. దీంతో అసంతృప్తిగానే ఆయ‌న ఈ నాలుగేళ్లు ప‌నిచేశారు.

అయితే.. త‌న‌ను ప్ర‌ధాన అర్చ‌కుడిగా నియ‌మించాల‌ని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ, న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉండ‌డంతో ఇది సాధ్యం కాద‌ని స్వ‌యంగా వైవీ సుబ్బారెడ్డి హ‌యాంలోనే తేల్చి చెప్పారు. ఇక‌, ఆ త‌ర్వాత‌.. నుంచి ధ‌ర్మం నాశ‌నం చేస్తున్నార‌ని, తిరుమ‌ల భ్ర‌ష్టుప‌ట్టిపోతోంద‌ని వ్యాఖ్య‌లుచేయ‌డం ప్రారంభించారు. ఇక‌, ఇటీవ‌ల ఆయ‌న ఓల్డ్ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కువ‌చ్చింది. దీనిలో సీఎం జ‌గ‌న్ క్రిస్టియ‌న్ అని.. ప్ర‌స్తుత టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి చ‌ర్చిల‌కు వెళ్లార‌ని.. అందుకే. ఆయ‌న‌ను ఈవో గా నియ‌మించారని, స‌గానికిపైగా క్రిస్టియ‌న్లే స్వామి ఆల‌యంలో ఉన్నార‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ఇక‌, ప్ర‌స్తుత చైర్మ‌న్ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ఇంట్లో ప్రార్థ‌న‌లు చేసి.. బ‌య‌ట‌కు వ‌చ్చి పూజ‌లు చేస్తార‌ని అన్నారు. అదేవిధంగా అహోబిలం మఠం, జీయర్‌లపైనా విమ‌ర్శ‌లు చేశారు. వీరు అధికారానికి లొంగిపోయార‌ని అన్నారు. ఈ  కామెంట్స్‌ సంచలనం రేపాయి. దీనిపై చర్చించిన పాలక మండలి రమణ దీక్షితులను ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.  

ఇవీ.. దీక్షితులు చేసిన‌ కామెంట్స్‌

+ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదు ఖననం చేశారు.

+ అహోబిలంలో రెండు వందల సంవత్సరాల క్రితం కొండ మీద ఒక గుహలో నిధులు ఉన్నాయని వాటిని బయటకు తీయాలని చాలా సార్లు అహోబిలం జియ్యర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తున్నారని ఆరోపించారు.

+ జియ్యర్‌లు ధర్మారెడ్డికి సాస్టాంగ పడతారన్నారు. అలా చేయకపోతే మూడు, నాలుగు కోట్ల నిధులను నిలిపివేస్తారని అన్నారు.

+ తిరుమల కిచెన్‌లో అన్ని అసాంఘీక కార్యక్రమాలు జరుగుతుంటాయని అన్నారు.

+ గుట్కా ప్యాకెట్‌లు అన్నీ చింపి బయట పోస్తుంటారని తెలిపారు. అందరినీ మ్యానేజ్ చేస్తుంటారు. దర్శనానికి వచ్చే జడ్జిలు, మినిస్టర్లు, ఆడిటర్‌లు, ఇలా అందరినీ మేనేజ్ చేస్తారని అన్నారు.

+శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు సరిగ్గా జరగడం లేదని చెప్పారు.  

ఈ వ్యాఖ్య‌లు నావి కావు:  వివ‌ర‌ణ‌

వీడియో వైరల్‌ కావడంతో రమణ దీక్షితులు స్పందించారు. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఉన్న వాయిస్‌ తనది కాదన్నారు. ఆ వీడియో చూసిన తర్వాత తాను షాక్‌కి గురైనట్టు ట్వీట్ చేశారు. తిరుమల అధికారులతో ఉన్న తనకు సత్సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్‌ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు.