గంటా మళ్లీ మారక తప్పదేమో !

హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అవద్దు. తెలుగుదేశంపార్టీ సీనియర్ తమ్ముడు గంటా శ్రీనివాసరావుకు రాబోయే ఎన్నికల్లో పోటీచేయటానికి జిల్లాలో సీటులేదు. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మార్చటం గంటా స్టైల్. అందుకనే ఇపుడ అసలు నియోజకర్గమే లేకుండాపోయింది. దాంతో గంటాను విశాఖపట్నం జిల్లాలో కాకుండా విజయనగరం జిల్లాలోని చీపురపల్లి నియోజకవర్గంలో పోటీచేయమని చంద్రబాబునాయుడు ఆదేశించారు. చీపురుపల్లిలో పోటీచేయటం గంటాకు ఏమాత్రం ఇష్టంలేదు. తన జిల్లాను వదిలేసి ఎక్కడా 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లిలో ఎందుకు పోటీచేయాలన్నది గంటా పాయింట్.

విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలను మార్చారు. ఇకిపుడు మార్చటానికి నియోజకవర్గం కూడా లేదు. ఎందుకంటే ఎంఎల్ఏలు లేదా మాజీలు తమ నియోజకవర్గాలను త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. అలాగే పొత్తులో జనసేనకు రెండో మూడో సీట్లివ్వాలి. మిగిలినవి రిజర్వుడు సీట్లు. అందుకనే చీపురుపల్లిలో పోటీచేయమని చంద్రబాబు చెప్పింది. అయితే తనకు ఏమాత్రం సంబంధం లేని చీపురుపల్లిలో పోటీచేసేది లేదని గంటా మీడియాతో చెప్పారు. తాను వైజాగ్ జిల్లాలోనే పోటీ చేస్తానని కూడా అన్నారు.

తనను విజయనగరం జిల్లాకు పంపుతున్న అధిష్టానంపై బాగా మండుతున్నారు. అందుకనే ఆదివారం అమరావతికి వచ్చి చంద్రబాబుతో దాదాపు గంటసేపు భేటీ అయ్యారు. చంద్రబాబు చీపురుపల్లిలో పోటీచేయాలని గట్టిగానే చెప్పారు. అయితే గంటా ఏమో భీమిలీ లేదా చోడవరంలో పోటీచేస్తానని అడిగారు. అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. గంటా ఒత్తిడి చేసిన కారణంగా అవకాశముంటే భీమిలీ, చోడవరంలో టికెట్ ఇచ్చే విషయమై పరిశీలిస్తానని చెప్పారు. అక్కడ సాధ్యం కాదని గంటాకు కూడా తెలుసు.

ఎందుకంటే ఆల్రెడీ అక్కడ పోటీ చేయటానికి తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. పైగా భీమిలీ సీటును జనసేన గట్టిగా పట్టుబడుతోంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా గంటాకు చీపురుపల్లిలో పోటీచేయటం ఒకటే దిక్కుగా అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గంటా పోటీచేయాలంటే చీపురుపల్లికి వెళ్ళాల్సిందే తప్ప వేరే దారిలేదు. అలాకదన్నపుడు పై రెండు నియోజకవర్గాల్లో పోటీచేయబోయే వారిని ఏదో మాయచేసి గంటా మ్యానేజ్ చేసుకుని తాను టికెట్ తెచ్చుకోవాలి. ఈ రెండు మార్గాల్లో తప్ప మూడోమార్గం కనబడటం లేదు. మరి గంటా ఏమిచేస్తారో చూడాల్సిందే.