ఓకే.. ‘కారు’ స‌ర్వీసింగుకే వెళ్లింది.. డౌట్ వ‌స్తుంద‌బ్బా!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌.. తాజాగా “మా కారు సర్వీసింగుకే వెళ్లింది” అని మ‌రోసారి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అయితే.. ఆయ‌న గ‌త డిసెంబ‌రులో ఎన్నిక‌లు జ‌రిగిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మాట‌ను 50 నుంచి 60 సార్లు చెప్పి ఉంటార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఎక్కడ ఏవేదిక ఎక్కినా.. కేటీఆర్ చెబుతున్న మాట ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. సంద‌ర్భంతో ప‌నిలేకుండా.. స‌మ‌యంతో నూ ప‌నిలేకుండా.. కేటీఆర్ ప‌దే ప‌దే.. మా కారు స‌ర్వీసింగుకే వెళ్లిందని చెబుతుండ‌డంతో.. ఏదో డౌట్ కొడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌స్తుతం ఉన్న టాక్ ఏంటంటే.. ‘కారు’ షెడ్డుకు వెళ్లింద‌ని! కాంగ్రెస్ నేత‌లు దీనిని ప్ర‌చారం చేయ‌డం లేదు. అయితే.. బీఆర్ ఎస్‌లోనే చిన్న‌పాటి గుస‌గుస వినిపిస్తోంది. దీంతో కేటీఆర్‌.. ఇలా ప‌దే ప‌దే కారు స‌ర్వీసింగుకు మాత్ర‌మే వెళ్లింద‌ని చెబుతున్నారు. దీనివ‌ల్ల లేనిపోని అపోహ‌లు తెర‌మీదికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా నాగ‌ర్ క‌ర్నూల్‌లో నిర్వ‌హించిన పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌భ‌లో కేటీఆర్ ప‌దే ప‌దే ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో పాల‌క ప‌క్షం కాంగ్రెస్‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ప‌థ‌కాలు ఎగ్గొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. గ్రామాల్లో కేసీఆర్‌పై ప్రేమ ఉన్నవారు లక్షల మంది ఉన్నారని, వారిని వ‌చ్చే ఎన్నిక‌ల‌లో పార్టీవైపు మ‌ళ్లించాల‌ని సూచించారు. ఇక‌, పదవులు రాలేదని నేతలకు బాధ ఉండొచ్చేమో గానీ.. కార్యకర్తలకు ఆ బాధ లేదని కీల‌క నేత‌ల‌కు చుర‌క‌లంటించారు. కార్యకర్తలను నేతలు ఏడాదిపాటు కాపాడుకుంటే.. మిగతా నాలుగేళ్లు కార్యకర్తలే నేతలను కాపాడతారని కేటీఆర్ తెలిపారు.

మ‌ళ్లీ అదే పాట‌!

ఇక‌, ఇటీవ‌ల అసెంబ్లీలో దుమ్మురేపిన ప్రాజెక్టుల అంశాన్ని మ‌రోసారి కేటీఆర్ కెలికారు. కృష్ణానదిపై ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కేంద్రానికి అప్పగించిందని విమ‌ర్శించారు. ఈ ప్రాజెక్ట్‌లను కాంగ్రెస్ నేతలు.. ఢిల్లీ పెద్ద‌ల చేతిలో పెట్టి గులాం గిరీ చేశార‌ని వ్యాఖ్యానించారు. ఎక్కడ కోల్పోతే అక్కడే సాధించుకోవాలంటూ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విజ‌యంపై కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. అచ్చంపేటలో పూర్వ వైభవం సాధించుకోవాలని పిలుపునిచ్చారు. “కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్లు ఉద్యమం చేశాం. 24 ఏళ్ల పాటు కారు 100 కి.మీ. వేగంతో జోరుగా వెళ్లింది. ప్రస్తుతం సర్వీసుకు మాత్రమే వెళ్లింది. తిరిగి వస్తుంది” అని కేటీఆర్ త‌నదైన శైలిలో వ్యాఖ్యానించారు.