మొత్తానికి తెలుగుదేశం-జనసేనల కూటమి నుంచి తొలి జాబితా బయటికి వచ్చేసింది. టీడీపీ నుంచి 94 మంది.. జనసేన నుంచి 5 మందిని తొలి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన మొత్తంగా 24 సీట్లలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. దీనిపై జనసైనికుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమందేమో.. పవన్ అన్నట్లే ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది ముఖ్యం కాదు, మెజారిటీ గెలవడం, జగన్‌ను ఓడించడం ప్రధాన లక్ష్యం కావాలి అన్నట్లు మాట్లాడుతుంటే.. మెజారిటీ జనసైనికులు సీట్ల సంఖ్య విషయంలో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నారు.
కొందరు జనసైనికుల పేరుతో వైసీపీ వాళ్లే.. సీట్ల విషయమై నానా రభస చేస్తూ ఒరిజినల్ జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. అలా అని అందరినీ ఆ గాటన కట్టడానికి వీల్లేదు. జనసేనకు మరీ తక్కువ సీట్లు ఇచ్చారని ఆవేదన చెందుతున్న జనసేన మద్దతుదారులు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నారు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌నే ఎక్కువమంది తప్పుబడుతున్నారు. పొత్తు ప్రకటన దగ్గర్నుంచి పవన్ వ్యవహార శైలి సరిగ్గా లేదన్నది వారి అభిప్రాయం. పవన్ తనకు తానే బార్గైనింగ్ పవర్ తగ్గించుకున్నాడని వాళ్లు అంటున్నారు. సీట్ల సంఖ్య విషయంలో అసంతృప్తితో టీడీపీకి ఓటు బదిలీ కాదని చెబుతూ జనసేన గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే కష్టమే. ఈ అసంతృప్తిని హ్యాండిల్ చేయడం సవాలే.
జనసైనికుల ఆగ్రహ జ్వాలను చల్లార్చే ప్రయత్నం పవన్ మాత్రమే కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చేయాల్సిందే. వారిని ఊరడించేలా మాట్లాడి.. పొత్తు అసలు లక్ష్యాన్ని వివరించాలి. ముఖ్యంగా చంద్రబాబు చొరవ తీసుకుని జనసేనానికి, జనసేన అభ్యర్థులకు, కార్యకర్తలకు తగిన గౌరవం, భరోసా ఇచ్చి కూటమి పట్ల విశ్వాసం పెంచాలి. వీలైతే ఇంకొన్ని సీట్లు పెంచే ప్రయత్నం చేస్తే మరీ మంచిది. ఇవన్నీ జరిగితేనే జనసైనికుల్లో సానుకూల భావన ఏర్పడి.. ఓటు బదిలీ సాఫీగా జరుగుతుందన్నది వాస్తవం.