రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి తరఫున పోటీ చేయబోతోన్న అభ్యర్థుల జాబితాను ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధం అని జగన్ అంటున్నారని, తాయు యుద్ధానికి సంసిద్ధం అయ్యామని పవన్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకే తాము పోరాడుతున్నామని పవన్ చెప్పారు. 60 నుంచి 70 సీట్లలో పోటీ చేయాలని తనతో చాలామంది పెద్దలు చెప్పారని అన్నారు. కానీ, గత ఎన్నికల్లో కనీసం 10 సీట్లు గెలిచి ఉంటే 50 నుంచి 60 సీట్లు అడిగే అవకాశం ఉండేదని పవన్ అన్నారు.
అయితే, సీట్ల సంఖ్య ముఖ్యం కాదని, పరిమిత సంఖ్యలో పోటీ చేసి ఎక్కువ స్థానాల్లో ఎక్కువ స్ట్రైక్ రేట్ తో గెలిచి చూపించాలని తాను భావిస్తున్నానని పవన్ అన్నారు. బీజేపీకి సీట్లు ఇచ్చే క్రమంలో తమ సీట్లు తగ్గించుకుంటున్నామని చెప్పారు. బీజేపీ ఆశీర్వాదం జనసేన-టీడీపీ కూటమికి ఉంటుందని, బీజేపీతో చర్చలు తుది రూపుదిద్దుకున్నాక ఆ సీట్లపై క్లారిటీ వస్తుందని పవన్ చెప్పారు. ఇక, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
అయితే, జనసేనకు పనిచేసిన ప్రతి ఒక్కరికి తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీని ఓడించేందుకే జనసేన-టీడీపీ కూటమి ఏర్పడిందని, రాబోయే ఎన్నికల్లో ఈ కూటమి విజయం తధ్యమని పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను సరైన మార్గంలో పెట్టేందుకే తమ కూటమి ముమ్మరంగా ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇప్పటం నుంచి ఈరోజు వరకు ఎంతో ఓపిగ్గా ఉంటూ ప్రజల భవిష్యత్తు కోసం ఎన్నో ఆటుపోట్లను భరించామని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates