త్రిముఖ వ్యూహంతో చంద్ర‌బాబు తొలిజాబితా!

తాజాగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు జాబితాలు ప్ర‌క‌టించారు. జ‌న‌సేన‌కు 24 స్తానాలు అసెంబ్లీ, టీడీపీ 94 స్థానాల్లోనూ పోటీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక‌, పార్ల‌మెంటు స్థానాల‌కు వ‌చ్చే స‌రికి జ‌న‌సేన‌కు 3 స్థానాలు కేటాయించారు. ఇక‌, టీడీపీకి ఎన్ని అనేది గోప్యంగా ఉంచారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన దానిని బ‌ట్టి అసెంబ్లీకి ఉన్న మొత్తం 175 స్థానాల్లో 118 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు.

అయితే.. వీటిలో టీడీపీ ఒక్క‌పార్టీని తీసుకుంటే.. మెజారిటీ స్థానాలు గ‌త ఎన్నిక‌ల్లోను.. ఇంత‌కు ముందు ఓడిపోయిన అభ్య‌ర్థుల‌కే కేటాయించారు. కేవ‌లం 5 నుంచి 6 స్థానాల‌లో మాత్ర‌మే కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చారు. తుని(య‌న‌మ‌ల దివ్య‌), క‌ళ్యాణ‌దుర్గం(అమ‌లినేని సురేంద్ర‌బాబు), చింత‌ల‌పూడి(ఎస్సీ-సొంత రోష‌న్ బాబు), క‌డ‌ప‌(మాధ‌వి), పులివెందుల‌(బీటెక్ ర‌వి), తిరువూరు(కొలిక‌పూడి శ్రీనివాస‌రావు)లు మాత్ర‌మే కొత్త‌వారు. మిగిలిన వారంతా గ‌త ఎన్నిక‌ల్లోనో.. ఇంత‌కు ముందో ఓడిన వారు కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఇలా పాత‌ముఖాల‌కు చోటు ఇవ్వ‌డం వెనుక మూడు ప్ర‌ధాన కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. వారికి గ‌తంలో ఓడిపోయార‌న్న సింప‌తి ఉండ‌డం. ఇది పార్టీని గెలిపిస్తుంద‌ని చంద్ర‌బాబు విశ్వ‌సిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. రెండోది.. ఆర్థికంగా, కేడ‌ర్ ప‌రంగా వారికి మంచి మార్కులు ఉండ‌డం.. మూడు క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌తో క‌లిసి ప‌నిచేస్తున్న తీరు. ఈ మూడు అంశాల‌ను ప్రామాణింకంగా తీసుకుని చంద్ర‌బాబు ప్ర‌యోగానికి దిగిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. అస‌మ్మతి ప్ర‌భావాన్ని వీరు త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగితే.. బాగానే ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.