టీడీపీకి 94, జనసేనకు 24

టీడీపీ-జనసేన కూటమి తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు.

ఈ రోజు 118 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేశారు. 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లతోపాటు 3 పార్లమెంట్ సీట్లు కేటాయించారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీతో పొత్తు విషయం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.

జనసేన తరఫున తెనాలి అసెంబ్లీ బరిలో నాదెండ్ల మనోహర్ నిలుచోబోతున్నారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆయనతో పాటు మరో నలుగురు అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటించారు. ఇక, టీడీపీ తరఫున 94 మంది అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. హిందూపురం నుంచి బాలకృష్ణ, మంగళగిరి నుంచి నారా లోకేశ్, కుప్పం నుంచి తాను, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, విజయనగరం నుంచి పూసపాటి అదితి గజపతి రాజు పోటీ చేయబోతున్నారని తెలిపారు.

వైజాగ్ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ, వైజాగ్ వెస్ట్ పీజీబీఆర్ నాయుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత ,నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని నుంచి యనమల దివ్య పోటీ చేయబోతున్నారని ప్రకటించారు. బీజేపీతో చర్చలు జరిపిన తర్వాత మిగతా అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.