ఉద్యమాల పేరుతో ఎన్ని రోజులు ఆందోళనలు చేసినా, ప్రతిపక్షాలు ఎన్ని డిమాండ్లు చేసినా ఉపయోగం ఉండదనే అనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి డెసిషన్ చూస్తే అందరికీ ఇదే విషయం అర్ధమైపోయింది. హిందుస్ధాన్ టైమ్స్ కు జగన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వికేంద్రీకరణే తమ ఫైనల్ నిర్ణయంగా స్పష్టం చేశారు.
వికేంద్రీకరణ అనే తమ నిర్ణయం నుండి వెనక్కు తగ్గేది లేదని జగన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఎవరెన్ని ఆందోళనలు చేసినా, ఎవరెన్ని డిమాండ్లు చేసినా తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమే లేదని చెప్పేశారు.
అమరావతి రాజధాని అనే డిమాండ్ తో చంద్రబాబునాయుడు రాజధాని ప్రాంతంలోని రైతులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నట్లు జగన్ ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో తన మద్దతుదారులు కొనుగోలు చేసిన భూముల ధరలు ఎక్కడ తగ్గిపోతాయో అన్న ఆందోళనలతోనే చంద్రబాబు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నట్లు జగన్ అభిప్రాయపడ్డారు. అధికార వికేంద్రీకరణ విషయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటి కూడా వికేంద్రీకరణ చేయాలనే చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.
రెఫరెండం గురించి మాట్లాడుతూ ఏ విషయంలో అయినా ప్రజాభిప్రాయం సేకరించే రెఫరెండం పద్దతి మనదేశంలో లేదని జగన్ గుర్తుచేశారు. రెఫరండంకు ప్రత్యామ్నాయంగా మన దగ్గర నిపుణుల కమిటిలు వేస్తారనే విషయాన్ని గుర్తుచేశారు. ఆ పద్దతిలోనే కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటికి అదనంగా తమ ప్రభుత్వం కూడా నిపుణులతో కమిటిలు వేసినట్లు చెప్పారు. నిపుణుల కమిటిలు చెప్పినట్లుగానే తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ రెఫరెండమే గనుక నిర్వహిస్తే ప్రజలు తమ నిర్ణయానికే మద్దతు ఇస్తారనే నమ్మకాన్ని కూడా జగన్ వ్యక్తం చేశారు.
మొత్తం మీద జగన్ తాజా ఇంటర్యూలో అమరావతి విషయమై తన నిర్ణయం ఏమిటో చెప్పేశారు. జగన్ మాటలు అమరావతి రైతులకు కాస్త బాధ కలిగించేవిగా ఉన్నా ముఖ్యమంత్రి నిర్ణయం రాజ్యాంగం ప్రకారం చెల్లదు కాబట్టి.. గెలుపు తమదే అనే నమ్మకంతో ఉన్నారు రైతులు. ఎందుకంటే రాజ్యాంగాన్ని అతిక్రమించిన ప్రతిసారీ ఏపీ సర్కారు కోర్టుల్లో ఓడిపోయి తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంది. తాము చట్టబద్ధంగా చేసుకున్న ఒప్పందాల వల్ల తమ హక్కులు ఎక్కడికీ పోవు అన్నది అమరావతి రైతుల వాదన.