ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంపై కొంత కాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మాతృభాషలోనే విద్యనభ్యసించాలనుకునే వారికి ఆ అవకాశం ఇవ్వాలని, ఇంగ్లిషు మీడియం వల్ల పిల్లలు మాతృభాషను మరచిపోయే ప్రమాదముందని విపక్షాలు, మేధావులు గగ్గోలు పెడుతున్నాయి. అయితే, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ఇంగ్లిషు మీడియం తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.
ఈ చర్చ ఇలా కొనసాగుతున్న దశలోనే కేంద్రం 5వ తరగతి వరకు మాతృభాష తప్పనిసరి అని నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ(ఎన్ఈపీ)-2020 ప్రకటించింది. ఎన్ఈపీ-2020 అమలు చేస్తామని కేంద్రం కరాఖండిగా చెప్పిన తర్వాత ఇప్పటివరకు దానిపై ఏపీ సీఎం జగన్ స్పందించలేదు. దీంతో, తన నిర్ణయానికే జగన్ కట్టుబడి ఉన్నారని అంతా అనుకున్నారు.
అయితే, తాజాగా కేంద్రం నిర్ణయానికి జగన్ సుముఖంగా ఉందన్న సంకేతాలు వచ్చేలా వ్యాఖ్యానించారు. కేంద్రం చెప్పినట్లు ఐదో తరగతి వరకు మాతృభాష అయిన తెలుగులో విద్యాబోధన చేస్తూనే, ఇంగ్లిషుకు సంబంధించి అదనపు పాఠ్యాంశాలు బోధించే యోచనలో ఉన్నామని జగన్ అన్నారు. దీనిని బట్టి ఇంగ్లిషు మీడియం వ్యవహారంపై జగన్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగావకాశాల్లో అసమానతలు తగ్గించేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలనుకుంటున్నామని జగన్ అన్నారు. జాతీయ విద్యావిధానం ప్రకారం దేశంలోని ప్రైవేట్ స్కూల్స్ అన్నీ ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాభోదన జరిపితే తమకూ అభ్యంతరం ఉండదన్నారు.
పేద విద్యార్థులకూ ప్రైవేటు పాఠశాలల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. ఆరో తరగతి నుంచి పూర్తిస్థాయిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని, ఇంగ్లిష్ భాషకు సంబంధించి ఐదో తరగతి వరకు కాస్త ఎక్కువ ఇన్ పుట్స్ ఇవ్వబోతున్నామని, దీంతో ఆరో తరగతి నుంచి విద్యార్థులు వెంటనే ఇంగ్లిష్ మీడియంకు మారడానికి వీలవుతుందని జగన్ అన్నారు.
జగన్ తాజా స్టేట్ మెంట్స్ చూస్తుంటే కేంద్రం నిర్ణయానికి సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు. ఐతే, అదే సమయంలో జగన్ చెప్పినట్లు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరుగుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, కేంద్రం నిర్ణయాన్ని జగన్ అంగీకరిస్తూనే ప్రైవేటు స్కూళ్లు ఆ నిర్ణయాన్ని ఫాలో కావని, అటువంటపుడు ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఎందుకు కావాలన్న లాజిక్ బయటకు తీశారు.
ఇక, తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదో తరగతి వరకు ఇంగ్లిషు సబ్జెక్టుకు సంబంధించి అదనపు ఇన్ పుట్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయించడం విశేషం. ఇంగ్లిషు మీడియంపై వస్తున్న విమర్శలు కావచ్చు…కేంద్రం నూతన విద్యావిధానం కావచ్చు….ఆ విషయంలో జగన్ మాత్రం మనసు మార్చుకున్నట్లే కనిపిస్తోంది.