ఎమ్మెల్యే లాస్య‌ పోస్టు మార్ట‌మ్ రిపోర్ట్..

MLA Lasya

తెలంగాణ‌లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది డిసెంబ‌రులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న భార‌త రాష్ట్ర‌స‌మితి నాయ‌కురాలు, శాస‌న స‌భ్యురాలు లాస్య నందిత  రోడ్డు ప్ర‌మాదంలో కన్నుమూశారు. ఆమె వ‌య‌సు 37 సంవ‌త్స‌రాలు. అయితే, ఆమె పోస్టు మార్టం నివేదిక‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి.  సీటు బెల్టు పెట్టుకోక‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వైద్యులు నిర్ధారించారు.

 ఈ రోజు తెల్లవారుజామున ప‌ఠాన్‌చెరు ఓఆర్ ఆర్ ర‌హ‌దారిపై కారులో వెళ్తుండ‌గా జ‌రిగిన రోడ్డు  ప్రమాదం లో ఎమ్మెల్యే లాస్య‌నందిత‌ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి స‌దాశివ‌పేట‌కు ద‌ర్గాలో ప్రార్థ‌న‌ల నిమిత్తం కారులో బ‌య‌లు దేరిన ఎమ్మెల్యే లాస్య నందిత.. పఠాన్‌చెరు ఓఆర్‌ఆర్ ర‌హ‌దారిపై కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు, డ్రైవ‌ర్‌ ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఎమ్మెల్యే మృతదేహాన్ని పటాన్‌చెరు ఆస్పత్రికి తరలించారు. ఇదిలా వుంటే, రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన లాస్య నందిత మాజీ ఎమ్మెల్యే, దివంగ‌త‌ సాయ‌న్న కుమార్తె కావ‌డం గ‌మ‌నార్హం. లాస్య మృతి ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల‌ రేవంత్‌రెడ్డి, బీఆర్ ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలుగుదేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌హా ప‌లువురు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. లాస్య నందిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గాంధీ ఆసుప‌త్రి వైద్యుల పోస్ట్ మార్టం నివేదిక‌లో కీల‌క విష‌యాలు..

+ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది

+ 6 దంతాలు ఊడిపోయాయి.

+ ఎడమకాలు పూర్తిగా విరిగిపోయింది.

+ తలకు బలమైన గాయం, శరీరంలో ఎముకలు స్వల్పంగా డ్యామేజ్ జరిగాయి

+ ప్ర‌మాద తీవ్రత‌కు మెద‌డులో న‌రాలు చిట్లిపోయి.. అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు

అధికార లాంఛ‌నాలు..

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోవడం దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సాయన్న చనిపోయి ఏడాది అయిందని.. అయిన నాలుగు రోజులకే కూతురు చనిపోవడం బాధాకరమన్నారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలను నిర్వహించాలని సీఎస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. ఆ మేర‌కు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామ‌న్నారు.