టార్గెట్ 12: బీఆర్ఎస్ ప‌క్కా స్కెచ్‌..

సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టన రాక‌ముందే.. హైదరాబద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సారి.. జ‌ల వివాదాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఎన్నిక‌ల ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా స‌మాచారం. గోదావరి, కృష్ణా జలాలపై బీఆర్ఎస్ నీటిపోరు యాత్ర చేపడుతున్నట్లు ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. కాళేశ్వరం, నాగార్జునసాగర్ నుంచి ఈ యాత్ర ఉండనుంది.

తెలంగాణలో నీటిపారుదల అంశంపై కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రగడ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అసెంబ్లీ వేదికగా ఘాటు విమర్శలు చేసుకున్నారు. ఈ అంశంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని దాదాపు ఒక‌నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న పార్టీ పెద్ద‌లు.. పాలమూరు నుంచి కేటీఆర్, నల్లగొండ నుంచి హరీష్ పాదయాత్ర చేసే అవకాశాలను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

నల్లగొండ సభ విజయవంతం కావడంతో ఫుల్ జోష్ మీదున్న బీఆర్ఎస్.. ఇదే ఊపుతో ప్రజల్లోకి వెళ్ల‌డం ద్వారా.. పార్టీని క‌నీసం 10 నుంచి 12 లోక్‌స‌బస్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ కోసం కొట్లాడేది ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే.. త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని మాజీసీఎం కేసీఆర్ అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జలాల అంశం పైన ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా రాష్ట్రంలోని ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించటానికి ఒప్పుకోలేదన్న‌విష‌యాన్ని.. రేవంత్ ఒప్పుకొన్నార‌న్న విష‌యాన్ని చెప్ప‌డం ద్వారా.. స‌క్సెస్ కావాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోసారి కాంగ్రెస్ కు ఓటేస్తే.. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ..తెలంగాణ కోసం కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ప్రజలకు చెప్ప‌డం ద్వారా.. ఎన్నిక‌లకు రెడీ అవుతున్న‌ట్టు తెలిసింది.