జనజీవన స్రవంతి నుండి దాదాపు పదేళ్ళుగా దూరంగా ఉంటున్న నేతలు కూడా రాబోయే ఎన్నికల పుణ్యమాని వెలుగులోకి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకళ్ళు. ఇపుడు విషయం ఏమిటంటే టీడీపీ, జనసేన పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరబోతోందనే ప్రచారం అందరికీ తెలుసింది. పొత్తు చర్చల్లో సీట్ల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలే కీలకం. ఇదిగనుక సెట్ అయ్యిందంటే చంద్రబాబునాయుడు ఎన్డీయేలో పార్టనర్ అవుతారు. తర్వాత సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ప్రకటిస్తారు. ఇదంతా ఇక లాంఛనమనే అనుకోవాలి.
ఇపుడు విషయం ఏమిటంటే జనాలందరు మరచిపోయిన నల్లారి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా రాజంపేట ఎంపీగా పోటీచేయబోతున్నారట. టీడీపీ, జనసేన మద్దతుతో కూటమి అభ్యర్ధిగా గెలుపు ఖాయమని అనుకుంటున్నారట. నల్లారి పోటీ ఖాయమైతే వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రత్యర్ధి అవుతారని అందరికీ తెలిసిందే. అప్పుడు ఫైట్ చాలా టఫ్ గా ఉంటుందనటంలో సందేహంలేదు. ఇక్కడ చిన్న మెలిక ఏమిటంటే రాజంపేట ఎంపీ నియోజకవర్గం ఇన్చార్జిగా సుగవాసి సుబ్రమణ్యంను చంద్రబాబు గతంలో ప్రకటించారు.
సుగవాసి కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బాగా తిరుగుతున్నారు. అలాగే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసేది తామే అన్న ఉద్దేశ్యంతో టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టేసుకుని తిరిగేస్తున్నారు. సడెన్ గా ఇపుడు ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ నేత నల్లారి అంటే సమీకరణలన్నీ మారిపోవటం ఖాయం. అప్పుడు సుగవాసి ఏమవుతారు ? రాజంపేట, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజలు చాలా ఎక్కువ. కాబట్టి రాజంపేట ఎంపీ అభ్యర్ధి, రాజంపేట, రాయచోటి ఎంఎల్ఏ అభ్యర్ధుల సామాజికవర్గాలను బట్టి ఎంపిక చేస్తారు.
ఇపుడు సడెన్ గా ఎంపీ అభ్యర్ధిగా నల్లారి వస్తే రాజంపేట, రాయచోటి ఎంఎల్ఏ అభ్యర్ధులు మారిపోతారు. దీనివల్ల ఇపుడు టీడీపీ, జనసేన తరపున చంద్రబాబు, పవన్ ప్రకటించిన ఇన్చార్జిల స్ధానాల్లో కొత్తవాళ్ళు తెరమీదకు వచ్చే అవకాశముంది. ఇలాంటి పరిస్ధితే సుమారు పది పార్లమెంటు నియోజకవర్గాల్లో తలెత్తబోతోంది. మరి వీటిని చంద్రబాబు, పవన్ ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.