బీజేపీ వైఖరి ఏమిటో అర్ధం కావడం లేదు. ఏపీలోని టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటామనే సంకేతాలు పంపించిన పార్టీ ఆ దిశగా కసరత్తును చేస్తున్నట్లు మాత్రం కనబడటం లేదు. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు చేసుకుంటున్న సమయంలో సడెన్ గా పొత్తుకు సిద్ధమనే సంకేతాలను బీజేపీ పంపింది. చంద్రబాబునాయుడును ఢిల్లీకి వచ్చి కలవాలని కబరుచేసింది. దాంతో చంద్రబాబు ఈనెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చర్చించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పొత్తుపై అప్ డేట్ లేదు.
బీజేపీ వైఖరి కారణంగా టీడీపీ, జనసేన మధ్య సీట్లసర్దుబాటు బాగా ఆలస్యమవుతోంది. దీనివల్ల రెండుపార్టీల్లోని నేతల్లో అసహనం పెరిగిపోతోంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపి ఫైనల్ చేయకుండా ఏపీలో బహిరంగసభలు పెట్టుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఈనెల 27వ తేదీన ఏలూరులో ప్రజాపోరు పేరుతో బహిరంగసభ నిర్వహిస్తోంది. దీనికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటున్నారు. ఒకవైపు టీడీపీ, జనసేన సంయుక్తంగా మీటింగులు పెట్టుకుంటున్నాయి.
మరోవైపు బీజేపీ ఒంటరిగా బహిరంగసభలు నిర్వహించుకుంటోంది. దీంతో మూడుపార్టీల మధ్య అసలు ఏమవుతుందో మామూలు జనాలకే కాదు పార్టీ నేతలకు కూడా అర్ధంకావటంలేదు. బీజేపీ వైఖరి ఏమాత్రం సమర్ధనీయంకాదు. పొత్తు పెట్టుకోదలచుకుంటే వెంటనే ఫైనల్ చేసేయాలి. లేకపోతే అదే విషయాన్ని చెప్పేయాలి. అంతేకాని పొత్తు చర్చలకు రమ్మని పిలిపించి మళ్ళీ ఇంతవరకు ఎలాంటి డెవలప్మెంట్లు లేదంటే ఏమిటర్ధం ? రోజులు గడిచే కొద్దీ ఎక్కువ నష్టపోయేది టీడీపీ, జనసేన మాత్రమే. ఇందులో కూడా మరింత నష్టం టీడీపీకే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
బీజేపీకి ఏపీలో ఉన్నదేమీ లేదు కాబట్టి కొత్తగా పోయేదేమీ లేదు. ఇదే సమయంలో జనసేనకు కూడా పెద్ద నష్టంలేదు. ఎందుకంటే ఇపుడున్నది ఒక్క సీటు. రాబోయే ఎన్నికల్లో ఆ ఒక్కటి గెలిచానా ఒక్కటే గెలవకపోయినా ఒకటే. కానీ టీడీపీది ఆ పరిస్ధితి కాదు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలిస్తినే పార్టీకి భవిష్యత్తు. లేకపోతే టీడీపీ పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరికి వాళ్ళుగా ఊహించుకోవాల్సిందే. ఈ విషయాలన్నీ బీజేపీకి తెలీక కాదు. అన్నీ తెలిసే పొత్తుపై ఏమీ తేల్చకుండా జాప్యం చేస్తోందంటేనే ఆశ్చర్యంగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates