షాక్: రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి

హైదరాబాద్ నగర శివారులో షాకింగ్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యువ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) దుర్మరణం పాలయ్యారు. కారు ప్రమాదంలో ఆమె ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్ చెర్వు ఓఆర్ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది. దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించారు. ఆమె పీఏ ఆకాశ్.. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు.

దివంగత నేత సాయన్న కుమార్తెగా లాస్య నందిత సుపరిచితురాలు. గత ఏడాది ఫిబ్రవరి 19న సాయన్న మరణించగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి కోటాలో లాస్య నందితకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఆమె ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇటీవల నల్గొండలో జరిగిన సభకు హాజరైన ఆమె.. తిరిగి వచ్చే క్రమంలో ఆమె కారును ఢీ కొన్న హోంగార్డు మరణించారు. ఆమెకు స్వల్ప గాయాలు అయ్యాయి. నార్కట్ పల్లి చెర్లపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించటం షాకింగ్ గా మారింది.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ సుల్తాన్ పూర్ ఓఆర్ ఆర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బ తింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. ఆమె సీటు బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తోంది. తీవ్ర గాయాలైన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. నిద్రమత్తు.. అతి వేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు.

ఆమె భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు. ఈ ఉదంతంలో కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని చెబుతున్నారు. అంతేకాదు..ఆమె ప్రయాణిస్తున్న కారు సైతం భద్రత విషయంలో మంచి పేరు లేదని చెబుతున్నారు. నల్గొండ సభ నుంచి తిరిగి వచ్చే వేళలో కారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తాజా ప్రమాద వేళలోనూ డ్రైవ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఎన్నికల బరిలో నిలిచి.. ఓటమిపాలైన ఆమె.. తండ్రి సాయన్న మరణం నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు.