ఔను.. మ‌మ్మ‌ల్ని వాళ్లే పిలిచారు: టీడీపీ క్లారిటీ

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో బీజేపీతో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసి వ‌చ్చారు. అయితే..త‌ర్వాత దీనిపై ఏం జ‌రిగిందనేది మాత్రం బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పూర్తిగా మౌనం దాల్చారు. మ‌రోవైపు బీజేపీ కూడా కేంద్రం పెద్ద‌లు తీసుకునే నిర్ణ‌యాన్ని బ‌ట్టి తాము న‌డుస్తామ‌ని చెప్పిందే త‌ప్ప‌.. మ‌రో మాట లేదు.

ఇదిలావుంటే.. చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ కీల‌క నేత అమిత్‌షాతో భేటీ అయిన త‌ర్వాత‌.. ఏపీలో అధికార పార్టీ వైసీపీ నుంచి కామెంట్లు పెరుగుతున్నాయి. ఎలాంటి ఆహ్వానం లేకుండానే చంద్ర‌బాబు వెళ్లార‌ని.. చంద్ర‌బాబును వారు కోరుకోవ‌డం లేద‌ని.. ఇలా.. అనేక వ్యాఖ్య‌లు, విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. వీటిపై తాజాగా టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. ఔను.. మ‌మ్మ‌ల్ని వాళ్లే పిలిచారు! అని తేల్చి చెప్పారు. “టీడీపీని ఎన్డీఏలోకి రావాల‌ని వాళ్లే ఆహ్వానించారు. దీనిని ఎవ‌రైనా విమ‌ర్శించినా.. వారికి మేం స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు” అని అన్నారు.

ఎన్డీయేలోకి రమ్మ‌ని పిలిచిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని అన్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. “పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవు. ఈ విష‌యాన్ని పార్టీ నాయ‌కులు గ‌మ‌నించాలి. టిక్కెట్లు కొల్పోయిన వాళ్లు బాధ పడొద్దని చంద్రబాబు, పవన్ చెబుతూనే ఉన్నారు. వారికి త‌గిన విధంగా భ‌విష్య‌త్తులో న్యాయం చేస్తామ‌ని అచ్చెన్న అన్నారు. అయితే.. దీనిని ప్ర‌త్య‌ర్థులు అడ్వాంటేజ్‌గా తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని దానికి చాన్స్ ఇవ్వ‌ద్ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ఇక వలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉంచకూడదని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇప్పటికే మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేశామని, వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని ఈసీ చెబుతోంటే.. ధర్మాన దానికి విరుద్దంగా మాట్లాడుతున్నారని.. పోలింగ్ బూత్‌ల‌లో వలంటీర్ల‌ను ఎలా కూర్చోబెడ‌తారని వ్యాఖ్యానించారు.