ముద్రగడలో అయోమయం పెరిగిపోతోందా ?

పాలిటిక్స్ లో మళ్ళీ యాక్టివ్ అవుదామని అనుకున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంలో అయోమయం పెరిగిపోతోందా ? గ్రౌండ్ లెవల్ లో జరుగుతున్న డెవలప్మెంట్లను చూస్తుంటే అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే నెలరోజులుగా ముద్రగడ జనసేనలో చేరుతారని జరిగిన ప్రచారం ఉత్త ప్రచారంగానే మిగిలిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికి వచ్చి పార్టీలో చేరమని ఆహ్వానిస్తారని ఒకపుడు పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాస్ మీడియాతో చెప్పారు.

అయితే ఆ తర్వాత పవన్ చాలాసార్లు తూర్పుగోదావరిలో తిరిగినా ఉద్యమనేత ఇంటికి మాత్రం వెళ్ళలేదు. తాజాగా రాజమండ్రి, భీమవరంలో పర్యటించినా ముద్రగడ ఇంటి వైపు మాత్రం చూడలేదు. దాంతో ముద్రగడలో అయోమయం పెరిగిపోతోందని సమాచారం. గడచిన పదేళ్ళుగా ముద్రగడ ఏ పార్టీలోను లేరు. కాపు ఉద్యమనేతగా పాపులర్ అయ్యారు కాని ముద్రగడ పోటి చేస్తే కాపులే అందరు ఓట్లేయలేదు. ఇలాంటి వ్యక్తి ఏ పార్టీలో చేరినా కాపులందరు ఆ పార్టీకి ఓట్లేసేస్తారన్న గ్యారెంటీ ఏమీలేదు.

ముద్రగడతో సమస్య ఏమిటంటే ఎవరితోను ఎక్కువ కాలం  సఖ్యతగా ఉండలేరు. చిన్న విషయానికి కూడా అలిగి పార్టీని, అధినేతను కంపు చేసేస్తారు. అందుకే పార్టీలు ఈయనకు దూరంగా  ఉంటున్నాయి. మధ్యలో ముద్రగడను పార్టీలోకి చేర్చుకోవాలని వైసీపీ నేతలు ప్రయత్నించినా తర్వాత ఎందుకనో వెనకడుగు వేశారు. అక్కడే జనసేన నేతలు యాక్టివ్ అయ్యారు. దాంతో ముద్రగడ జనసేనలో చేరటానికి ఉద్యమనేత కూడా రెడీ అయిపోయారు. నిజానికి ఇటు పవన్ అటు ముద్రగడ ఇద్దరికీ విపరీతమైన ఇగో ఉంది. ముద్రగడ గనుక జనసేనలో చేరితే తొందరలోనే ఇద్దరి మధ్య పర్సనాలిటి క్లాష్ మొదలవ్వటం ఖాయం.

ఇవన్నీ ఆలోచించుకునే పవన్ వెనక్కు తగ్గినట్లు పార్టీ వర్గాల సమాచారం. టికెట్ల విషయంలో ఎలాంటి కండీషన్లు పెట్టకుండా భేషరతుగా ఉద్యమనేత పార్టీలో చేరాలన్నది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే సమయంలో కాకినాడ ఎంపీగా తనకు, పిఠాపురం ఎంఎల్ఏగా తన కొడుకు గిరిబాబుకు టికెట్లు ఇవ్వాలని ముద్రగడ డిమాండ్ చేశారట. పోటీ విషయాన్ని స్వయంగా గిరిబాబే మీడియాలో ప్రకటించారు. దాంతో ముద్రగడ కండీషన్లు పెట్టింది నిజమే అనే ప్రచారం పెరిగిపోతోంది. మరి ముద్రగడ ఎపిసోడ్ చివరకు ఏమవుతుందో చూడాలి.