మిగిలిన పార్లమెంట్ సీట్ల సంగతిని పక్కన పెట్టేస్తే ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభకు నాగబాబు పోటీ చేయటం దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయం నాగబాబు ప్రకటనల్లోనే స్పష్టంగా తెలుస్తోంది. అయితే జనసేన నేతల్లో మొదలైన ప్రశ్న ఏమిటంటే నాగబాబు అనకాపల్లిలో గెలవగలరా ? అని. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నన్ని కులాలు ఇంకెక్కడా ఉండవు. మిగిలిన నియోజకవర్గాలను వదిలేసినా అనకాపల్లిలో తూర్పుకాపులు, కొప్పుల వెలమలు చాలా బలమైన సామాజికవర్గాలు. ఈ రెండు సామాజికవర్గాలను కాదని మిగిలిన సామాజికవర్గాలకు చెందిన నేతలు ఏమీ చేయలేరు.
ఇపుడు నాగబాబు పైన చెప్పిన రెండు సామాజికవర్గాల్లో దేనికీ చెందరు. పైగా నాగబాబుది గోదావరి జిల్లాకు చెందిన కాపు సామాజికవర్గం. కాపులు అంటే అగ్రవర్ణాలకు చెందిన వారు. అదే తూర్పుకాపులు, కొప్పుల వెలమలు బీసీ సామాజికవర్గాల్లోకి వస్తారు. పైగా మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణకు ఎంపీ టికెట్ హామీ ఇచ్చి పార్టీలోకి చేర్చుకుని ఇపుడు అన్యాయం చేస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. గవర ఉపకులానికి చెందిన నేత కొణతాలకు అన్యాయం జరిగుతోందనే ప్రచారం బాగా పెరిగిపోతుంది.
ఇదే సమయంలో వైసీపీ తరపున ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు లోక్ సభకు పోటీచేయచ్చని అంటున్నారు. బూడి కొప్పుల వెలమ సామాజికవర్గం. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కొప్పుల వెలమ, గవర్లు, తూర్పుకాపులు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి నాగబాబుకు పై సామాజికవర్గం నుండి ఏ మేరకు సహకారం అందుతుందో అనుమానమే అని పార్టీలోనే చర్చ పెరిగిపోతోంది.
ఇపుడు బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోనే ఉన్న మాడుగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాడుగులలో గవర సామాజికవర్గం బలంగా ఉంది. కాబట్టి వైసీపీ నుండి బూడి, జనసేన తరపున నాగబాబు ఎంపీగా పోటీచేస్తే పోటీ టైట్ గా ఉండే అవకాశం ఉంది. పోటీ ఎంత టైట్ గా జరిగినా నాగబాబుకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. టీడీపీ కూటమి తరపున పోటీచేసే ఎంపీ అభ్యర్ధిని బట్టి వైసీపీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధిని ఫైనల్ చేయాలని జగన్ అనుకున్నారట. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates