చింత‌ల‌పూడి తెర‌పైకి ఫ్రెష్ క్యాండెట్‌ను దింపిన చంద్ర‌బాబు

నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల ఎంపిక‌లో స్పీడ్ పెంచిన చంద్ర‌బాబు రెండు రోజుల వ్య‌వ‌ధిలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను నియ‌మించారు. ఈ రెండూ ఏలూరు జిల్లాలోనివే కావ‌డం విశేషం. ముందు నూజివీడుకు మాజీ మంత్రి, ప్ర‌స్తుత పెన‌మ‌లూరు ఎమ్మెల్యే కొలుసు పార్థ‌సారథిని నియ‌మించ‌గా… అదే జిల్లాలోని చింత‌ల‌పూడి ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సీటుకు ఎన్నారై సొంగా రోష‌న్‌కుమార్‌ను నియ‌మించారు. గ‌త మూడున్న‌ర సంవ‌త్స‌రాలుగా పార్టీకి ఇన్‌చార్జ్ అంటూ ఎవ్వ‌రూ లేకుండా దిక్కూమొక్కూ లేకుండా ఉన్న చింత‌ల‌పూడి టీడీపీకి ఎట్ట‌కేల‌కు సొంగా రోష‌న్‌కుమార్ రూపంలో యంగ్ ఎన్నారై లీడ‌ర్ అయితే దొరికాడు.

చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో ఎన్నారైల‌కు ఎక్కువుగా ప్ర‌యార్టీ ఇస్తూ వ‌స్తున్నారు. ఈ కోవ‌లోనే మ‌రో ఎన్నారైగా ఉన్న రోష‌న్‌కు సీటు ఇవ్వ‌డం విశేషం. రోష‌న్ స్వ‌స్థ‌లం నియోజ‌క‌వ‌ర్గంలోని లింగ‌పాలెం మండ‌లంలోని ధ‌ర్మాజీగూడెం. 2019 ఎన్నిక‌ల్లో సీటు కోసం ట్రై చేసినా చివ‌ర్లో స‌మీక‌ర‌ణ‌లు కుద‌ర‌క సీటు రాలేదు. అయినా గ‌త నాలుగేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న స్వ‌చ్ఛంద సంస్థ మిష‌న్ హోప్‌తో ర‌క‌ర‌కాల సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ రావ‌డంతో పాటు పార్టీ కేడ‌ర్‌కు అందుబాటులో ఉంటూ వ‌స్తున్నారు. గ‌త యేడాది కాలంగా నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత యాక్టివ్ అయ్యారు.

చింత‌ల‌పూడి టీడీపీ సీటు కోసం రోష‌న్‌కుమార్‌తో పాటు మ‌రో నేత బొమ్మాజీ అనిల్‌, ఆకుమ‌ర్తి రామారావు మ‌ధ్య గ‌ట్టి పోటీ న‌డిచింది. ఆరేడు నెల‌లుగా ఈ ముగ్గురు నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ వ‌స్తున్నారు. ఇక ఎన్నిక‌ల వేడి స్టార్ట్ అవ్వ‌డంతో చంద్ర‌బాబు చింత‌ల‌పూడి టీడీపీ ఇన్‌చార్జ్ విష‌యంలో నెల‌కొన్న స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ రోష‌న్ పేరు ఖ‌రారు చేశారు. రోష‌న్ ఎస్సీల్లో మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. రాజ‌కీయాల‌కు కొత్త‌… తొలిసారి ప్ర‌త్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు. తొలిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుండ‌డంతో పూర్తిగా క్లీన్ ఇమేజ్‌తో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నారు.

ఇక ఇదే సీటు నుంచి వైసీపీ త‌ర‌పున మాజీ బ్రేక్ ఇన్‌స్పెక్ట‌ర్ కంభం విజ‌య‌రాజు పేరు ఖ‌రారు కాగా ఆయ‌న కూడా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. విజ‌య‌రాజుకు కూడా ఇవే తొలి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లు. ఏదేమైనా రెండు ప్ర‌ధాన పార్టీల నుంచి అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డంతో చింత‌ల‌పూడిలో పొలిటిక‌ల్ హీట్ మామూలుగా లేదు.