టీడీపీ, జనసేనల పై వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ ఇంటి బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అంటూ టీడీపీ గుర్తు సైకిల్ ను, జనసేన గ్లాస్ గుర్తును జగన్ అవమానించిన వైనంపై టీడీపీ, జనసేన నేతలు మండిపడుతున్నారు. ఆల్రెడీ ఈ విషయంలో జగన్ కు జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కౌంటర్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఓ పిట్టకథతో నాగబాబు మరోసారి కౌంటర్ ఇచ్చారు.
విమానాలు తుడిచే ఓ వ్యక్తికి విమానం నడపడం ఎలా అనే పుస్తకం దొరికిందని ఆ వ్యక్తిని జగన్ తో పోలుస్తూ నాగబాబు చురకలంటించారు. విమానం ఇంజన్ స్టార్ట్ కావడం కోసం ఆకుపచ్చ బటన్ నొక్కాలని, విమానం కదిలేందుకు పచ్చ బటన్ నొక్కాలని రాసుందని సంక్షేమ పథకాలకు జగన్ బటన్లు నొక్కుతున్న వైనంపై విమర్శలు గుప్పించారు. విమానం వేగం అందుకోవడానికి నీలం బటన్, గాల్లో విమానం ఎగిరేందుకు ఆరెంజ్ బటన్ నొక్కాలని ఉండటంతో వెనకా ముందు ఆలోచించకుండా ఆ బటన్లను ఆ వ్యక్తి నొక్కేశాడని నాగబాబు చెప్పారు.
ఇక విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత విమానం కిందకు దిగేందుకు ఈ పుస్తకం రెండో వాల్యూమ్ కొనుక్కోవాలి అనడంతో విమానాలు తుడిచే వ్యక్తి అవాక్కయ్యాడని నాగబాబు సెటైర్లు వేశారు. విమానం అయినా, అధికారం అయినా అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేని వాడు ఎక్కితే ఇలాగే ఉంటుందని, విమానం, రాష్ట్రం సర్వనాశనం కాక తప్పదు అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం నడపడం అంటే బటన్ నొక్కడం కాదని, సమర్థత, అనుభవం కూడా ఉండాలని జగన్ పై నాగబాబు పరోక్షంగా చురకలంటించారు. ప్రస్తుతం జగన్ పై నాగబాబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates