బాలినేని పంతం నెగ్గించుకున్నారా

ఒంగోలు ఎంఎల్ఏ, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి తన పంతం నెగ్గించుకున్నట్లే ఉన్నారు. తన నియోజకవర్గంలో అర్హులైన పేదలకు 25 వేల ఇళ్ళపట్టాలను పంపిణీ చేస్తేకాని రాబోయే ఎన్నికల్లో పోటీచేసేది లేదని బాలినేని చాలాకాలంగా చెబుతున్నారు. ఇదే విషయమై పట్టుబట్టి ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే విషయమై బాలినేని చాలాసార్లు అలిగారు కూడా. సరే మార్గం ఏదైనా, ప్రయత్నాలు ఎలాచేసినా 25 వేల ఇళ్ళపట్టాలు పంపిణీ చేయటానికి రంగం సిద్ధమైంది.

ఈనెల 23వ తేదీన జగన్మోహన్ రెడ్డి ఒంగోలుకు రాబోతున్నారు. భారీ బహిరంగసభ నిర్వహించి పట్టాల పంపిణీ చేయబోతున్నారు. భూసేకరణకు ప్రభుత్వం రు. 170 కోట్లు విడులచేసింది. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తేకాని రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగనని చాలాకాలం క్రితమే బాలినేని ప్రకటించారు. దాని ప్రకారం భూసేకరణ, సౌకర్యాల ఏర్పాటు తదితరాల కోసం ప్రభుత్వం తాజాగా 170 కోట్లను విడుదలచేసింది. ఇప్పటికే జిల్లా అధికారులు భూమిని ఎంపికచేసి అవసరమైన ఏర్పాట్లు చేశారు. డబ్బులు మంజూరవ్వటమే మిగిలింది.

తాజాగా ఆ ముచ్చట కూడా అయిపోయింది కాబట్టే పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఆ సభలో జగన్ పాల్గొనబోతున్నారు. కాబట్టి బాలినేని లాంగ్ పెండింగ్ డిమాండ్ నెరవేరిందనే అనుకోవాలి. కాబట్టి ఇకనైనా తన అలకను వదిలేసి ఎన్నికల ప్రక్రియలో బాలినేని నూరుశాతం పాల్గొంటారని అనుకుంటున్నారు. బాలినేని రెండు అంశాలపై బాగా పట్టుబట్టారు. అవేమిటంటే ఒంగోలు పేదలకు ఇళ్ళపట్టాలు పంపిణీ, ఒంగోలు ఎంపీ అభ్యర్ధికి మాగుంట శ్రీనివాసులరెడ్డికి మళ్ళీ టికెట్ ఇవ్వటం.

చాలాకాలం రెండింటిని జగన్ పెండింగ్ పెట్టారు. దాంతో బాలినేని కూడా చాలాసార్లు అలగటం, బుజ్జగింపులు తదితరాలన్నీ జరగాయి. మాగంటకు టికెట్ ఇచ్చేదిలేదని తేల్చిచెప్పిన జగన్ పేదలకు ఇళ్ళపట్టాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగానే రు. 170 కోట్లను విడుదలచేసింది. దాంతో బాలినేని కూడా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. ఇళ్ళపట్టాల పంపిణీ పూర్తయిపోతే జిల్లా రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నది. మరి ఒంగోలు ఎంపీగా ఎవరు పోటీచేస్తారు ? దాని ప్రభావం మిగిలిన అసెంబ్లీల్లో ఎలాగ పడుతుందో చూడాలి.