పవన్ ప్రకటనలు వ్యూహాత్మకమేనా ?

జిల్లాల పర్యటనల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. డైరెక్టుగా అభ్యర్ధులని కాకుండా నియోజకవర్గాల ఇన్చార్జిల పేరుతో ప్రకటనలు చేస్తున్నారు. రాజమండ్రి పర్యటనలో పవన్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కందుల దుర్గేష్ ను ఇన్చార్జిగా ప్రకటించారు. నిజానికి ఇపుడు దుర్గేష్ ను ఇన్చార్జిగా ప్రకటించటమే విడ్డూరంగా ఉంది. ఎందుకంటే చాలాకాలంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయటానికి దుర్గేష్ ఏర్పాటు చేసుకుంటున్నారు. టికెట్ తనకే వస్తుందన్న భరోసాతో చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలన్నింటినీ తన భుజానే మోస్తున్నారు.

కాబట్టి ఇపుడు అభ్యర్ది అని కాకుండా ఇన్చార్జని పవన్ ప్రకటించారంతే. రాజానగరం నియోజకవర్గాన్ని జనసేనే పోటీచేస్తుందని కూడా పవన్ ప్రకటించారు. కాకపోతే అభ్యర్ధని కాని లేకపోతే ఇన్చార్జని కాని ప్రకటించలేదు. మొన్నటికి మొన్న విశాఖపట్నం పర్యటనలో నాలుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ నియోజకవర్గం ఇన్చార్జిగా వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ ని నియమించారు. గాజువాకలో సుందరపు సతీష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్, ఎలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్ ను పవన్ ఇన్చార్జిగా ప్రెకటించారు. అందరికీ తెలుసు పవన్ చేస్తున్నది అభ్యర్ధుల ప్రకటనే అని.

ఒకపుడు చంద్రబాబునాయుడు దారిలోనే మిత్రపక్షం అధినేత నడుస్తున్నట్లు అర్ధమవుతోంది. అప్పట్లో చంద్రబాబు నాలుగు నియోజకవర్గాల్లో డైరెక్టుగా అభ్యర్ధులనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనే ఇపుడు పవన్ వరుసగా తన జిల్లాల పర్యటనలో ఇన్చార్జీలను ప్రకటిస్తున్నారు. వీళ్ళిద్దరు ఎందుకిలా రకరకాలుగా ప్రకటిస్తున్నట్లు ? ఎందుకంటే పొత్తులో సీట్ల సర్దుబాటు ఫైనల్ చేసుకునే సమయంలో బీజేపీ కూడా దూరింది. దాంతో ఇద్దరు తమ ప్రకటనలను ఎక్కడివక్కడే ఆపేశారు.

అయితే బీజేపీతో పొత్తు విషయం ఆలస్యమయ్యేట్లు కనబడుతోంది. ముందు చంద్రబాబు ఎన్డీయేలో చేరాలి. ఆ తర్వాత పొత్తు, సీట్ల సర్దుబాటు జరగాలి. ఇవన్నీ అయ్యేటప్పటికి చాలా రోజులు పట్టేట్లుంది. అందుకనే కచ్చితంగా టీడీపీ, జనసేన పోటీ చేస్తుందని నమ్మకం ఉన్న సీట్లను ఇద్దరూ ప్రకటించేస్తున్నారు. పవన్ లేటుగా జోరుపెంచారంతే. మరి పొత్తులు, సీట్ల సర్దుబాట్లను బీజేపీ ఎప్పుడు ఫైనల్ చేస్తుందో ఏమో చూడాల్సిందే.