తలసానికి ఉచ్చు బిగుసుకుంటోందా ?

అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతే తర్వాత అందుకు మూల్యం చెల్లించక తప్పదంటారు పెద్దలు. ఇపుడీ విషయం ఎందుకంటే మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గురించే. మంత్రిగా ఉన్నపుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు తొందరలోనే మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. బీసీ బంధు విషయంలో కేసీయార్ హయాంలో అమలైన పథకాల్లో బీసీలకు గొర్రెల పంపిణీ పథకం కూడా ఒకటి. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, బిల్లులు చెల్లించకుండానే చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నది ఆరోపణ.

ఇవి ఆరోపణలు మాత్రమే కావని నిధులు పెద్దఎత్తున దుర్వినియోగం అయ్యాయని, అవినీతి జరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) రిపోర్టులో స్పష్టంగా ఉంది. బాధ్యులను గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా కాగ్ సూచించింది. అప్పటికే పథకం అమలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గచ్చిబౌలి పోలీసులు పశుసంవర్ధక శాఖ ఉన్నతాదికారులపై కేసులు నమోదుచేశారు. వారితో పాటు మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాసయాదవ్ పేషీలో పనిచేసిన అధికారులపైన కూడా కేసులు నమోదయ్యాయి.

పోలీసులు జరిపిన విచారణలో చాలా విషయాలు వెలుగుచూశాయట. ఇది పూర్తిగా నిధుల దుర్వినియోగం, అవినీతి వ్యవహారం కాబట్టి తర్వాత పోలీసులు కేసును ఏసీబీకి బదిలీచేశారు. బాధ్యతలు తీసుకోగానే ఏసీబీ ఉన్నతాధికారులు ఏపీలోని ఒంగోలుకు వెళ్ళి విచారణ జరిపారు. అక్కడి వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఒంగోలుకు ఎందుకు వెళ్ళారంటే తెలంగాణా పథకంలో పంపిణీ చేసిన గొర్రెలను ఒంగోల నుండే సరఫరా చేశారు కాబట్టి. అసలు ఈ వ్యవహారమంతా బయటపడింది కూడా గొర్రెల సరఫరాదారుల నుండే.

ఎలాగంటే పథకం పంపిణీకి వీలుగా ఒంగోలులో గొర్రెల పంపిణీ దారులు 130 యూనిట్లను సరఫరా చేశారట. ఒక యూనిట్ అంటే 21 గొర్రెలు. దశలవారీగా సరఫరా అయిన యూనిట్ల గొర్రెలకు బిల్లులు మాత్రం చెల్లించలేదట. కొంతకాలం తర్వాత తమకు రావాల్సిన డబ్బుల గురించి గొర్రెల సరఫరాదారులు హైదరాబాద్ కు వచ్చి వాకాబు చేశారట. అయితే గొర్రెల పంపిణీదారులకు డబ్బులు ఎప్పుడో సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉందట.

దాంతో పంపిణీదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా ఎన్నికలకు ముందు జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫిర్యాదును సీరియస్ గా తీసుకుంది. దాంతో అప్పటి అవినీతంతా బయటపడింది. శాఖలోని చాలామంది మీద పోలీసులు ఇప్పటికే కేసులు నమోదుచేసి విచారిస్తున్నారు. అందరి వేళ్ళు తలసాని వైపే చూపుతున్నాయట. అందుకనే తలసాని మెడకు గొర్రెల ఉచ్చు బిగుసుకుంటోందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.