ఉభయగోదావరి జిల్లాలోని నేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రాజమండ్రికి చేరుకున్న పవన్ తన అజెండా ప్రకారమే మంగళవారం సమావేశాలు నిర్వహించబోతున్నారు. రెండురోజుల క్రితమే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని నేతలతో విశాఖపట్నంలో సమావేశమైన విషయం తెలిసిందే. అదేపద్దతిలో ఇపుడు ఉభయగోదావరి జిల్లాల్లోని నేతలందరినీ రాజమండ్రికి చేరుకోవాలని కబురుచేయటంతో అందరు చేరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులో జనసేన ఎన్ని సీట్లకు పోటీచేయబోతోంది, పోటీచేయబోయే నియోజకర్గాలు ఏవన్న విషయాలనే నేతలతో పవన్ డీటైల్డ్ గా చర్చించబోతున్నారు.
ఒకరకంగా ఎన్నికల సన్నాహక సమావేశాలనే చెప్పాలి. అలాగే పనిలోపనిగా తమ నేతలను పవన్ మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నట్లున్నారు. ఎందుకంటే నేతలు, కాపు సామాజికవర్గంలోని ముఖ్యుల ఆలోచనలు చాలా హైరేంజిలో ఉన్నాయి. తక్కువలో తక్కువ 60 నియోజకవర్గాల్లో జనసేన పోటీచేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్లుంది. రెండుపార్టీల నేతల సమాచారం ప్రకారం 25 అసెంబ్లీలకు మించి జనసేనకు చంద్రబాబునాయుడు ఇచ్చే అవకాశాలు లేవట.
ఇక్కడే డిమాండ్లకు, వాస్తవానికి మధ్య ఎంత తేడా ఉందో అర్ధమైపోతోంది. ఈ విషయం మీదే పవన్ నేతలకు స్పష్టత ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో పార్టీ పోటీచేయబోయే సీట్లు విషయంలో పవన్ ఇదే పద్దతిలో మాట్లాడారు. త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. పోటీచేసే అవకాశాలు కోల్పోయినా నేతలు బాధపడద్దని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే ఇంతకు మించిన పదవులు వస్తాయని భరోసా ఇచ్చారు. ఇపుడు రాజమండ్రి సమావేశంలో కూడా ఇదే విషయాన్ని పవన్ చెప్పే అవకాశముంది.
కాకపోతే ఉత్తరాంధ్రకు ఉభయగోదావరి జిల్లాలకు మధ్య తేడా ఉంది. అదేమిటంటే జనసేన పోటీచేస్తుందని ప్రచారంలో ఉన్న నియోజకవర్గాల్లో అత్యధికం ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. జనసేన పోటీచేస్తుందని అనుకుంటున్న 25 నియోజకవర్గాల్లో 12 స్ధానాలు ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉన్నాయని పార్టీవర్గాల సమాచారం. ఇలాంటి జిల్లాల్లోనే నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పవన్ చెబితే మరి ఇతర జిల్లాల్లో జనసేనకు ఎన్నిసీట్లు ఇస్తారనే చర్చ పెరిగిపోతోంది. మరీ ప్రశ్నలకు పవన్ ఏమి సమాధానం చెబుతారు, నేతలను ఎలా ఊరడిస్తారో చూడాలి.