ఏపీ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అదేసమయంలో మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. “ఇదేం పద్దతి. మీరు ఎలానూ ఓడిపోతారు. ఇంకా దాడులు చేయడం ఎందుకు? ఇప్పటికైనా మానుకోండి. లేక పోతే తీవ్రపరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది” అని బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. మరి దీని ప్రభావమో ఏమో.. తెలియదు కానీ.. సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. నిత్యం తాను తిట్టిపోసే ఓ పత్రిక ఫొటో జర్నలిస్టుపై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకుని.. వెంటనే నిందితులపై చర్యలకు ఆదేశించారు. దీంతో ఈ పరిణామం ఆసక్తిగా మారింది.
ఏం జరిగింది?
ఆదివారం సాయంత్రం అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సిద్ధం-3వ సభలో ఓ దినపత్రికకు చెందిన ఫొటో జర్నలిస్టుపై దాడి జరిగింది. ఈ దాడిలో సదరు ఫొటో జర్నలిస్టు తీవ్రంగా గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయనకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వంపైనా, నాయకులపైనా విమర్శలు వస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా జర్నలిస్టుకు సంఘీభావం తెలుపుతూ.. అనేక మంది ప్రకటనలు జారీ చేశారు. అయితే.. ప్రభుత్వం వైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు.
బాలయ్య వార్నింగ్..
జర్నలిస్టుపై జరిగిన ఘటనపై బాలయ్య స్పందించారు. వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విధుల్లో ఉన్న జర్నలిస్టులపై వైసీపీ నాయకులు.. దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. “రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయి. జర్నలిస్టులకు రక్షణ కరువైంది. జర్నలిస్టుల రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశ్నించే గొంతు నొక్కాలనుకోవడం హర్షించదగిన విషయం కాదు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు మరెంతో దూరం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం” అని బాలయ్య వార్నింగ్ ఇచ్చారు.
జగన్ రెస్పాండ్..
బాలయ్య సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. వెను వెంటనే సీఎం జగన్ అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. “ఇలాంటి ఘటన జరుగుతుందని మీకు ముందే తెలుసా? తెలిసినా.. చేతులు ముడుచుకుని కూర్చున్నారా?” అని సీఎం జగన్ ప్రశ్నించారు. అదేవిధంగా ఈ ఘటనలో బాధ్యులు ఎలాంటి వారైనా..చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాలు అందిన వెంటనే ఎస్పీ మీడియా ముందుకు వచ్చారు. ఘటనలో బాధ్యులైన వారిని గుర్తించినట్టు చెప్పారు. ఇందులో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల మీద అదనపు ఎస్పీ స్థాయి అధికారులతో విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఈ విషయంపై సీఎం జగన్ కూడా సీరియస్‌గా ఉన్నారని. తెలిపారు. మొత్తానికి ఈ ఘటనతో అంటే.. బాలయ్య వార్నింగ్.. జగన్ రియాక్షన్‌తో బాధిత జర్నలిస్టుకు న్యాయం జరగడం.. ఆసక్తిగా మారింది.