ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, పొలిటికల్ కమెడియన్ అని ప్రతిపక్ష పార్టీలు, ఇతర నాయకులు పిలుచుకునే కిలారి ఆనంద పాల్ తాజాగా ఏపీ రాజకీయ నేతలకు సవాల్ రువ్వారు. అది కూడా ఆయన రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులకు సవాల్ రువ్వడం గమనార్హం. “విజయవాడలో పేద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా.. ఆ విగ్రహం సాక్షిగా నాతో చర్చలకు రావాలి“ అని టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌కి సవాల్ విసిరారు. విగ్రహాలు చూసి దళితులు మోసపోరని తేల్చి చెప్పారు. టీడీపీ, జనసేన, వైసీపీని వీడి బయటకు రావాలని బడుగు, బలహీన వర్గాల వారికి విజ్ఞప్తి చేశారు. ఆ మూడు పార్టీలు బీజీపీకి తొత్తులని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 160 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని పాల్ చెప్పారు. మిగిలిన 15 సీట్ల కోసమే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కొట్టుకుంటున్నాయని తనదైన శైలిలో పాల్ అన్నారు. తమ పార్టీకి160 సీట్లు ఇచ్చేందుకు ప్రజలురెడీగా ఉన్నారని చెప్పారు. “ఇది పక్కా. దీనిపై నేను ఎవరితోనైనా చర్చించేందుకు రెడీ. చంద్రబాబు, జగన్, ఎవరు వచ్చినా సిద్ధం“ అని పిడికిలి బిగించి మరీ చెప్పారు. ఇక, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని.. తనతో కలిసి నడవాలని.. వేలకోట్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని తనదైన వ్యాఖ్యలు చేశారు.
విగ్రహాలు ఎవరి కొరకు!
“అంబేడ్కర్ విగ్రహాలు పెడుతున్నారు. అవి ఎవరి కొరకు? ఎస్సీ ఎస్టీలకు మేలు చేయాలంటే.. ముందుగా వారికి అన్ని పథకాలు సమగ్రంగా అందజేయాలి. విద్యను విస్తరించాలి. అవి వదిలేసి విగ్రహాలు పెడతామంటే.. ఎలా? ఎందుకు? అంబేడ్కర్ ఏమన్నా.. జగన్ కల్లోకి వచ్చి అడిగారా? ఆయన విగ్రహాలుపెట్టమని చెప్పారా?“ అని కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్ రాజ్యాధికారం కావాలని అడిగాడు కానీ, విగ్రహాలు పెట్టమని అడిగాడా? అని కేఏ పాల్ ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని, కులాన్ని విమర్శించనని చెప్పారు.
పవన్‌కు ఓట్లు లేవు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీలో ఓటు బ్యాంకు లేదని పాల్ అన్నారు. “పవన్ కళ్యాణ్‌కి ఓట్లు లేవు కాబట్టి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఆయన పార్టీపై ఆయనకే నమ్మడం లేదు. కాపు సోదరులు అందరూ నాతోనే ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు వస్తానంటే.. ఇప్పుడే పార్టీలో చేర్చుకుంటే. అలాంటి వారు వచ్చేయాలి.“ అని కేఏ పాల్ అన్నారు. జగన్ చొక్కాలు మడత పెట్టాలని అంటున్నాడని, చంద్రబాబు ఏమో కుర్చీలు మడత పెడతామని చెబుతున్నారని.. ఇద్దరినీ కలిసి ప్రజలు వచ్చే ఎన్నికల్లో ప్రజలు మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పాల్ వ్యాఖ్యానించారు.