టీడీపీ తో పొత్తు ఇష్టం లేని ఏకైక బీజేపీ నాయకుడు

ఏపీ బీజేపీ నాయ‌కుడు.. విష్ణు వ‌ర్ధ‌న్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో దుమారం రేపుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఎవ‌రి ప‌ల్ల‌కీనీ మోయ‌బోమ‌ని.. తాము ఎందుకు మోయాల‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతే కాదు.. తాము బ‌లంగా ఉన్నామ‌ని భావిస్తున్నందునే త‌మ వెంట పొత్తు పెట్టుకునేందుకు తిరుగుతున్నార‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం సీటు త‌మ‌కే కావాల‌ని కూడా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను పైకి ఆయ‌న సొంత‌మ‌ని.. వాటితో త‌మ పార్టీకి సంబంధం లేద‌ని.. పోతూరి నాగ‌భూష‌ణం వంటి వారు కొట్టిపారేయొచ్చు.

కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం విష్ణు వంటి నాయ‌కుడు మీడియా ముందుకు వ‌చ్చి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయడం వెనుక‌.. ఖ‌చ్చిత‌మైన వ్యూహం ఉంటుంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనివెనుక పెద్ద స్థాయిలోనే భారీ వ్యూహానికి తెర‌దీశారని చెబుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు సోము వీర్రాజు పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్న స‌మ‌యంలోనూ ఇలానే టీడీపీ విష‌యంలో వ్యాఖ్య‌లుచేశారు. ఆయ‌న కోట‌రీలో ఉన్న విష్ణు.. అప్ప‌ట్లోనూ టీడీపీతో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఇప్పుడు నోరు చేసుకున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తున్న మాట వాస్త‌వం. అయితే.. దీనికి టీడీపీ బ‌లం చాలక కాదు.. వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌క‌మైనవి కావ‌డం.. పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌న్న బ‌ల‌మైన కాంక్ష ఉన్న నేప‌థ్యంలోనే సాగుతున్న ప్ర‌క్రియ‌గా చూడాలి. కానీ, విష్ణు వంటి వారు.. తామేదో బ‌లంగా ఉన్నామ‌ని.. అందుకే టీడీపీ త‌మ చెంత‌కు వ‌స్తోంద‌ని అంటున్నారు. అనుకుంటున్నారు. వాస్త‌వానికి.. బీజేపీ ఒంట‌రిగా పోరు చేసిన సంద‌ర్భంలో ఒక్క శాతానికి మించి కూడా ఓట్లు రాలేదు.

అంతెందుకు.. రాష్ట్ర ఓట‌ర్ల ప‌రిస్తితి ప‌క్క‌న పెడితే.. గ‌త ఏడాది జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనే మాధ‌వ్‌.. త‌న సిట్టింగ్ స్థానాన్ని నిల‌బెట్టుకోలేక పోయిన ప‌రిస్థితి విష్ణు మ‌రిచిపోయి ఉంటార‌ని అనుకోవాలా? లేక‌.. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని ఆయ‌న గాలికి వ‌దిలేసి ఉంటారా? అనేది చ‌ర్చ‌నీయాంశం. బీజేపీ మాట ల్లోనే చెప్పాలంటే.. మ‌హాభార‌తంలో చేత‌కాక‌.. శ్రీకృష్ణుడు రాయ‌బారం చేశాడా? సంధికి ప్ర‌య‌త్నించాడా? అనేది తేల్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. క‌లిస్తే.. రెండ‌యినా.. సీట్లు గెలుచుకునే స‌త్తా వ‌స్తుంది.. లేక‌పోతే.. క‌మ‌ల వికాసం మాట అటుంచి.. మొహం కూడా ఎత్తుకోలేని ప‌రిస్థితి దాపురిస్తుంది.